జగన్ గారూ.. ఆ అంబులెన్సులో మీ పార్టీ కార్యకర్తనే తీసుకెళ్లారు.. ఇరుకు సందుల్లో సభలు పెడతారా?: దేవినేని ఉమా

మీ సభ కోసం వచ్చిన వైసీపీ కార్యకర్తను ఆటో ఢీకొంది
108కు ఫోన్ చేసింది మీ పార్టీ కార్యకర్తలే
వెళ్లడాని మరో దారి లేకపోవడం వల్లే.. అంబులెన్సు ఆ దారిలో వచ్చింది
పాదయాత్ర సందర్భంగా నిన్న వైసీపీ అధినేత జగన్ ప్రసంగిస్తుండగా… ఓ అంబులెన్సు మధ్యలో వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ప్రభుత్వంపై జగన్ మండిపడ్డారు. 108 అంబులెన్సులు రాష్ట్రంలో తిరుగున్నాయని చెప్పుకోవడానికే సభ మధ్యలో అంబులెన్సును పంపించారని… ఇది ప్రభుత్వ వికృతమైన చర్య అని విమర్శించారు. అంబులెన్సులో పేషెంటే లేడని ఆయన వ్యాఖ్యానించారు.

ఈ ఘటనకు సంబంధించి జగన్ పై మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. జగన్ సభకు హాజరయ్యేందుకు వైసీపీకి చెందిన కార్యకర్తలు లారీల్లో వచ్చారని… ఓ కార్యకర్త లారీ నుంచి కిందకు దిగుతున్న సమయంలో ఓ ఆటో అతన్ని ఢీకొందని చెప్పారు. అతను తీవ్రంగా గాయపడటంతో… పక్కనున్న వైసీపీ కార్యకర్తలే 108కు ఫోన్ చేశారని చెప్పారు. ఆ అంబులెన్సులో ఆసుపత్రికి పోయింది మీ పార్టీ కార్యకర్తేనని… ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నాడని అన్నారు. మీ కార్యకర్తను రక్షించేందుకు అంబులెన్సు వస్తే… ప్రభుత్వం వికృతమైన చర్యకు దిగింది అంటారా? అని మండిపడ్డారు.

అంబులెన్సు వెళ్లడానికి మరో దారి లేకపోవడం వల్లే… సభా జరుగుతున్న దారి గుండా వెళ్లాల్సి వచ్చిందని దేవినేని ఉమా చెప్పారు. ఇరుకు సందుల్లో సభలు పెట్టడం ఏమిటని ధ్వజమెత్తారు. జగన్ మాట్లాడిన భాష సరిగా లేదని అన్నారు. రాష్ట్రంలో పెట్టుబడిదారులను భయభ్రాంతులకు గురి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం యత్నిస్తుంటే… జగన్ ఒక్క మాట కూడా మాట్లాడటం లేదని విమర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *