జగన్‌పై నమ్మకంతో 7నెలలు ఎదురుచూశాం! -రాజధాని మార్చొద్దని విజ్ఞప్తి

అక్షిత నెట్వర్క్, మరావతి:  ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ మందడంలో మహా ధర్నా  కొనసాగుతోంది. రైతులు, మహిళలు  మోకాళ్లపై నిలబడి తమ నిరసన వ్యక్తంచేస్తున్నారు. సేవ్‌ అమరావతి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. అమరావతిపై ఇంకెన్ని కమిటీలు వేస్తారని నిలదీస్తున్నారు. రాజధానిపై సీఎం స్పష్టమైన ప్రకటన చేసే వరకు ఆందోళనలు విరమించేది లేదని స్పష్టంచేస్తున్నారు. ‘అమరావతినే రాజధానిగా కొనసాగించాలి..  మూడు రాజధానుల ప్రతిపాదన వెనక్కి తీసుకోవాలి’ అనే ఏకైక డిమాండ్‌తో 11వ రోజూ నిరసనలు హోరెత్తాయి. ఉదయం నుంచి మందడంలో మహా ధర్నా పేరిట ప్రజలంతా ఆందోళనల్లో పాల్గొంటున్నారు. వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చి సంఘీభావం తెలుపుతున్నారు. మూడు రాజధానులు అన్యాయమంటూ రాజధాని ప్రజలంతా ముక్తకంఠంతో నినాదాలు చేస్తున్నారు. మూడు రాజధానుల ప్రతిపాదనను నిరసిస్తూ పలువురు రైతులు, మహిళలు, యువకులు, విద్యార్థులు తమ ఆవేదనను పంచుకున్నారు.

బోస్టన్‌ కమిటీ కూడా బూటకమే!

‘‘బోస్టన్‌ కమిటీ కూడా జీఎన్‌ రావు కమిటీలా బూటకమే. ఆ కమిటీపై అవినీతి ఆరోపణలు ఉన్నాయి. అలాంటి కమిటీని తీసుకొచ్చి రాజధానిపై నివేదిక అడుగుతున్నారు. ప్రభుత్వానికి మేం భూములిస్తే గంటకో కమిటీలు వేసి కాలయాపన చేసే కార్యక్రమమే జరుగుతోంది తప్ప పూర్తి చేయాలన్న ఆలోచనే లేదు. గందరగోళ పరిస్థితులు సృష్టిస్తున్నారు.. ఇది మంచిది కాదు. ఇక్కడ పెట్టిన ప్రతి రూపాయిలో రాష్ట్ర ప్రజలందరి డబ్బు ఉంది. మేం చేపడుతున్న ఉద్యమానికి ప్రజలంతా మద్దతు పలకాలని విజ్ఞప్తి చేస్తున్నాం’’

ఇది 29 గ్రామాల సమస్య కాదు

‘‘ఇది కేవలం 29 గ్రామాల సమస్య కాదు.. ఏపీ భవిష్యత్తు సమస్య. రాజధాని పెడుతున్నాం.. భూములు ఇవ్వండి అని ఆ రోజు సీఎంగా చంద్రబాబే కాదు.. జగన్‌ వచ్చి అడిగినా మేం ఇచ్చేందుకే మేం సిద్ధం. ఇది 13 జిల్లాలకు చెందిన యువతీ యువకుల భవిష్యత్తు సమస్య. ఒక రాజధాని కట్టడానికే వనరులు లేవని అంటున్నారు.. మరి మూడు రాజధానులను నిర్మించి అభివృద్ధి చేస్తామనడం హాస్యాస్పదం. ఒక్క రాజధాని కట్టలేనోళ్లు మూడు రాజధానులు ఎలా కడతారు? జనవరి 3న బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూప్‌ నివేదిక జీఎన్‌ రావు కమిటీ కంటే కొత్తగా ఉంటుందని మేం అనుకోవడంలేదు’’

మమ్మల్ని రోడ్డున పడేశారు

‘‘మాకేం కావాలని కొత్తగా డిమాండ్‌ చేసేదేం లేదు. మా అమరావతి మాకు కావాలన్నదే డిమాండ్‌. సీఎం జగన్‌పై ఎంతో నమ్మకంతో ఏడు నెలల పాటు ఎదురు చూశాం. అమరావతిని అభివృద్ధి చేయకపోగా మూడు రాజధానులంటూ మమ్మల్ని ఇబ్బందులు పెడుతూ రోడ్డున పడేసిన ఘనత ఆయనకే చెందుతుంది.  రాజధాని ఇక్కడే కొనసాగిస్తామని చెప్పేవరకూ పోరాటం విరమించం’’

మా భవిష్యత్తు ఏమై పోవాలి

మూడు రాజధానులతో భవిష్యత్తులో చాలా ఇబ్బందులు వస్తాయి. రాజధాని మారిస్తే మా భవిష్యత్తు ఏమైపోవాలి?  తాను కన్న కలల్ని పిల్లలు నెరవేర్చాలని సీఎం ఎలా ఆలోచిస్తారో మా తల్లిదండ్రులు కూడా అంతే. మమ్మల్ని తమ కలల్ని నెరవేర్చేలా తీర్చిదిద్దాలనుకుంటారు. కానీ, ఇలాంటి నిర్ణయంతో మా భవిష్యత్తు ఏమైపోవాలో ఆలోచించండి. ముఖ్యమంత్రి గారు నిర్ణయం మార్చుకుంటే మంచిది’’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *