టీఆర్ ఎస్ పార్టీకే ఓట్లడిగే నైతిక హక్కు
కాంగ్రెస్ పార్టీలో ఓటమి భయం
ఉప ఎన్నికలో భగత్ గెలుపు ఖాయం
మంత్రి జగదీశ్ రెడ్డి
త్రిపురారం, అక్షిత న్యూస్ :తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ చేసేదే చెబుతారని…చెప్పేదే చేస్తారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి ఉద్ఘాటించారు. ఎన్నికల ప్రచారాల్లో భాగంగా ప్రజలకు ఇచ్చిన ఒక్కో వాగ్దానాన్ని ఆయన నిలబెట్టుకుంటున్నారని అన్నారు. నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో ఓట్లు అడిగే నైతిక హక్కు టీఆర్ఎస్ పార్టీకే ఉన్నదని అన్నారు. నియోజకవర్గం గురించి ఏనాడూ పట్టించుకోని జానారెడ్డి ఏ ముఖం పెట్టుకొని ప్రజలను ఓట్లడుగుతున్నారని జగదీశ్ రెడ్డి ప్రశ్నించారు. జానా ప్రచారం చేసిన గ్రామాల్లోని ఓటర్లంతా ఇదే అంశం గురించి నిలదీయడంతోనే ఆయన వెనుదిరిగారని విమర్శించారు. జానాలో ఓటమి భయం పట్టుకుందని, దీంతో ఆయన తీవ్ర అసహనానికి గురవుతున్నారని అన్నారు. నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో నోముల భగత్ విజయం ఖాయమని మంత్రి జగదీష్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.నాగార్జునసాగర్ నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా ఆయన బుధవారం త్రిపురారం మండలంలోని కామారెడ్డిగూడెం,కొణతాల పల్లి తదితరుల గ్రామాల్లో విస్తృత ప్రచారం నిర్వహించారు. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నోముల భగత్ తో పాటు రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి, త్రిపురారం మండల ఎన్నికల ఇంఛార్జీలు నకిరేకల్ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య, మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్,రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు రామచంద్రనాయక్ తదితరులు ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాలలో జరిగిన ఎన్నికల ప్రచార సభలలో ఆయన మాట్లాడారు. ఇక్కడి ప్రజలఅమాయకత్వంతో వరుసగా ఏడుసార్లు గెలిచిన జానారెడ్డి కనీసం సాగర్ మొదటి మేజర్ కు నీళ్లు ఇవ్వలేకపోయారని దుయ్యబట్టారు. అటువంటి వ్యక్తి నిజస్వరూపం కొత్తగా ఏర్పడ్డ తెలంగాణా రాష్ట్రంలో బయటపడినందునే 2018 ఎన్నికల్లో జానారెడ్డి ని ప్రజలు తిరస్కరించి నోముల నరసింహయ్య కు పట్టం కట్టారని ఆయన గుర్తుచేశారు. దురదృష్టవశాత్తు నోముల అకాల మరణంతో ఈఉప ఎన్నిక వచ్చిందని అన్నారు. నోముల నరసింహయ్య ఐదేండ్ల పాటు అధికారంలో ఉండాలని ఇక్కడి ప్రజలు ఆకాంక్షించారని.. ఆ ఆకాంక్ష అర్ధాంతరంగా ఆగిపోకుండా ఉండేందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ నోముల భగత్ ను ఆశీర్వదించి బరిలో నిలిపారని ఆయన చెప్పారు.ప్రజాభీష్టానికి అనుకూలంగా తీసుకున్న నిర్ణయంలో టీఆర్ఎస్ పార్టీ విజయదుందుబి మోగిస్తుందని ఆయన స్పష్టం చేశారు. 40 ఏండ్లుగా త్రాగునీరు, సాగునీరు లేక నాగార్జున సాగర్ నియోజకవర్గం ఎడారిగా మారిందని ఆయన ఆరోపించారు. టెయిల్ ఎండ్ పేరుతో ఇక్కడి భూములను ఎండపెట్టిన చరిత్ర జానారెడ్డిది, కాంగ్రెస్ పార్టీదని విమర్శించారు. అందుకే కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన జానారెడ్డిని 2018 ఎన్నికల్లో నే ఇక్కడి ప్రజలు తిరస్కరించారన్నారు. అటువంటి పెద్ద మనిషి ఏమి చేశారో, ఏమి చేస్తారో ఎన్నికల ప్రచారంలో చెప్పాల్సి వస్తుందన్న భయంతోటే ముఖం చాటేసే ప్రయత్నం చేస్తున్నారని ఆయన విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే సాగర్ ఎడమ కాలువ కింది భూములకు సమృద్ధిగా రెండు పంటలకు నీళ్లు అందిస్తున్నామని ఆయన చెప్పారు. వచ్చేనెల 17న జరుగనున్న నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి భగత్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను జగదీశ్ రెడ్డి అభ్యర్ధించారు.