చిన్నస్వామిలో రికార్డుల మోత..!

    • ధోనీ రికార్డు బద్దలు కొట్టిన కోహ్లీ

బెంగళూరు: చిన్నస్వామి స్డేడియం వేదికగా జరిగిన నిర్ణయాత్మక వన్డేలో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. స్టీవ్‌ స్మిత్‌ (131) శతకం సాధించడంతో తొలుత ఆసీస్‌ 286 పరుగులు చేసింది. షమి (4/63) రాణించాడు. అనంతరం బరిలోకి దిగిన భారత్‌.. రోహిత్‌శర్మ (119), విరాట్‌ కోహ్లీ (89) చెలరేగడంతో 47.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. హిట్‌మ్యాన్‌ ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’‌, కోహ్లీ ‘మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌’ దక్కించుకున్నారు. ఈ మ్యాచ్‌తో మైదానంలో పలు రికార్డులు నమోదయ్యాయి.

* అన్నిఫార్మాట్లలో కలిపి అత్యధిక పరుగులు సాధించిన భారత సారథిగా విరాట్ కోహ్లీ (11,208) రికార్డు సృష్టించాడు. అంతకుముందు ఈ రికార్డు ధోనీ (11,207) పేరిట ఉండేది. అయితే ధోనీ దీనిని 330 ఇన్నింగ్స్‌ల్లో సాధించగా కోహ్లీ 199 ఇన్నింగ్స్‌లోనే ఈ ఘనత అందుకున్నాడు.

* ధోనీ పేరిట ఉన్న మరో రికార్డును కోహ్లీ బద్దలుకొట్టాడు. వన్డే ఫార్మాట్‌లో అత్యంత వేగంగా అయిదు వేల పరుగులు పూర్తిచేసిన భారత సారథిగా కోహ్లీ రికార్డు సృష్టించాడు. ధోనీ 127 ఇన్నింగ్స్‌ల్లో 5వేల పరుగుల మైలురాయి అందుకోగా రికార్డుల రారాజు 82 ఇన్నింగ్స్‌ల్లోనే సాధించాడు.

* వన్డేల్లో అత్యధిక ‘మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌’లు దక్కించుకున్న జాబితాలో కోహ్లీ (8) మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. గేల్‌, షాన్‌ పొలాక్‌ సరసన కోహ్లీ సంయుక్తంగా మూడో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో సచిన్ (14), జయసూర్య (11) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.

*  వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన నాలుగో క్రికెటర్‌గా రోహిత్‌శర్మ (29) రికార్డు నెలకొల్పాడు. ఈ జాబితాలో సచిన్‌ తెందుల్కర్ (49), కోహ్లీ (43), రికీ పాంటింగ్ (30) తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. అయిదో స్థానంలో సనత్‌ జయసూర్య (28) ఉన్నాడు.

* వన్డేల్లో అత్యంత వేగంగా తొమ్మిది వేల పరుగుల మైలురాయిని సాధించిన మూడో క్రికెటర్‌గా హిట్‌మ్యాన్‌ (217) నిలిచాడు. ఈ జాబితాలో కోహ్లీ (194), డివిలియర్స్‌ (208) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. రోహిత్‌ తర్వాతి స్థానాల్లో గంగూలీ (228), సచిన్ (235), లారా (239) ఉన్నారు.

* వన్డేల్లో అత్యధిక శతక భాగస్వామ్యాలు సాధించిన మూడో జోడిగా రోహిత్‌-కోహ్లీ (18) నిలిచారు. ఈ జాబితాలో సచిన్‌-గంగూలీ (26), దిల్షాన్‌-సంగక్కర (20) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.

* గత ఏడాది జనవరి నుంచి డెత్‌ ఓవర్లలో అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా షమి (19) రికార్డు నెలకొల్పాడు. ముస్తాఫిజుర్ (22) తొలి స్థానంలో ఉన్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *