చిదంబరం ఇంటికి సీబీఐ అధికారులు

అక్షిత ప్రతినిధి, దిల్లీ : కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరానికి ముందస్తు బెయిల్‌ ఇచ్చేందుకు దిల్లీ హైకోర్టు నిరాకరించిన నేపథ్యంలో ఆయన నివాసానికి సీబీఐ అధికారులు వెళ్లారు. ఆరుగురు సీబీఐ అధికారుల బృందం దిల్లీలోని ఆయన నివాసానికి వెళ్లడంతో చిదంబరాన్ని అరెస్టు చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. అయితే, అధికారులు వెళ్లిన సమయంలో ఆయన ఇంట్లో లేకపోవడంతో వారు వెనుదిరిగినట్టు సమాచారం.  ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో చిదంబరం ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో ఆయన పాత్రపై సీబీఐ, ఈడీ సంస్థలు పలుమార్లు విచారించాయి. ఈ క్రమంలో ముందస్తు బెయిల్‌ కోసం ఆయన చేసుకున్న పిటిషన్‌పై మంగళవారం విచారణ సందర్భంగా దిల్లీ ఉన్నత న్యాయస్థానం  కీలక వ్యాఖ్యలు చేసింది. ఆయన చట్టసభ సభ్యుడైనంత మాత్రాన ముందస్తు బెయిల్‌ ఇవ్వాల్సిన అవసరంలేదని పేర్కొంది. మరోవైపు, దిల్లీ హైకోర్టు నిర్ణయాన్ని చిదంబరం తరఫున న్యాయవాది కపిల్‌ సిబల్‌ సుప్రీంకోర్టులో సవాల్‌ చేసినట్టు సమాచారం. దీనిపై కాసేపట్లో విచారణ జరిగే అవకాశం ఉంది. మన్మోహన్‌సింగ్‌ హయాంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన చిదంబరం 2007లో ఐఎన్‌ఎక్స్‌ మీడియా సంస్థకు రూ.305 కోట్లు విదేశీ నిధులు మళ్లించేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంలో కీలకంగా వ్యవహరించారనే అభియోగాలను ఎదుర్కొంటున్నారు.

 

 

tags :   chidambaram                                  inx media case,         high court

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *