పరకాల, అక్షిత ప్రతినిధి : పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిని తెలంగాణ సీఎం కేసీఆర్ పరామర్శించారు. వరంగల్ గ్రామీణ జిల్లా న్యూశాయంపేట మండలంలోని ప్రగతి సింగారంలో ధర్మారెడ్డి నివాసానికి సీఎం వెళ్లారు. ధర్మారెడ్డి తండ్రి దశదిన కర్మకు హాజరయ్యారు. ఈ నెల 4న ధర్మారెడ్డి తండ్రి మల్లారెడ్డి అనారోగ్యంతో మృతిచెందిన విషయం తెలిసిందే. అంతకముందు సీఎం ప్రగతి సింగారం గ్రామానికి చేరుకోగానే ఆయనకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, జిల్లా కలెక్టర్ హరిత, పోలీస్ కమిషనర్ రవీందర్ పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికారు. అనంతరం హెలిప్యాడ్ నుంచి ప్రత్యేక బస్సులో ఎమ్మెల్యే ధర్మారెడ్డి నివాసానికి సీఎం చేరుకొని మల్లారెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సీఎం పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. చల్లా ధర్మారెడ్డి నివాసంలో జిల్లా ప్రజాప్రతినిధులతో కేసీఆర్ సమావేశమయ్యారు. జిల్లా అభివృద్ధి, పురపాలిక ఎన్నికల సన్నద్ధత తదితర అంశాలపై ఆయన సమావేశంలో చర్చించారు. అనంతరం ముఖ్యమంత్రి హైదరాబాద్కు పయనమయ్యారు.