చర్చలు జరుపండి

-28వ తేదీనాటికి నివేదిక ఇవ్వండి

-విలీనం షరతును కార్మికసంఘాలు పక్కనపెట్టాలి

-ఆర్థికభారంలేని సమస్యలను సంస్థ పరిశీలించాలి

-ఆర్టీసీ యాజమాన్యం, కార్మికసంఘాలకు హైకోర్టు ఆదేశం

-కన్సీలియేషన్ ప్రక్రియ మధ్యలో ఉండగా సమ్మెకు వెళ్లారు

-ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ యాక్ట్ ప్రకారం వ్యవహరిస్తాం

అదనపు అడ్వకేట్ జనరల్ జే రామచంద్రరావు 

-బస్సులన్నీ రోడ్లపైకి 

-సాధారణ స్థితికి సర్వీసులు

-రోడ్డెక్కిన 73.82% బస్సులు 

-క్రమంగా పెరుగుతున్న సేవలు

-నేడు రాష్ట్ర బంద్ నేపథ్యంలో భద్రతాఏర్పాట్లు చేసిన పోలీసులు

హైదరాబాద్, అక్షిత ప్రతినిధి: ప్రజలకోసం చర్చలు జరుపాలని ఆర్టీసీ, కార్మిక సంఘాలను రాష్ట్ర హైకోర్టు ఆదేశించింది. చర్చల సారాంశంపై 28వ తేదీన తమకు నివేదిక ఇవ్వాలని పేర్కొన్నది. ఆర్టీసీ సమ్మెపై శుక్రవారం విచారణ చేపట్టిన హైకోర్టు.. విలీనం షరతును పక్కన పెట్టాలని కార్మిక సంఘాలకు సూచించింది. దీనికి అంగీకరిస్తూ.. ఆ షరతును తొలగిస్తున్నట్టు కార్మికసంఘాల తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. కన్సీలియేషన్ ప్రక్రియ మధ్యలో కార్మిక సంఘాలు సమ్మెకు వెళ్లాయని, ఈ నేపథ్యంలో పారిశ్రామిక వివాదాల చట్టం ప్రకారం వ్యవహరిస్తామని అదనపు అడ్వొకేట్ జనరల్ జే రామచంద్రరావు హైకోర్టు తెలిపారు. ఇదిలా ఉంటే.. సమ్మె నేపథ్యంలో ప్రభుత్వ సూచనతో ఆర్టీసీ తీసుకుంటున్న చర్యలతో క్రమంగా సాధారణ పరిస్థితి నెలకొంటున్నది. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చేస్తున్న ఏర్పాట్లు మంచి ఫలితాలిస్తున్నాయి.

ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రజలు గమ్యస్థానాలకు చేరుతున్నారు. ఆ యా జిల్లాల్లో రీజినల్ మేనేజర్ల పర్యవేక్షణలో డిపో మేనేజర్లు తాత్కాలిక డ్రైవర్, కండక్టర్, ఇతర సిబ్బందిని ఎంపికచేసి సాధ్యమైనంత వరకు బస్సులను తిప్పడానికి చర్యలు తీసుకుంటున్నారు. వంద శాతం బస్సులను నడిపించేందుకు తగిన ఏర్పా ట్లు చేస్తున్నారు. ప్రజారవాణా సౌకర్యాలను కల్పించడంలో సంస్థ ఇం చార్జి ఎండీ సునీల్‌శర్మ రోజువారీగా సమీక్షిస్తూ సంబంధిత అధికారులకు తగిన ఆదేశాలిస్తున్నారు. హైదరాబాద్‌లోనూ ప్రజారవాణా సౌకర్యాన్ని పెంచే దిశగా అధికార యంత్రాంగం కసరత్తు చేస్తున్నది. ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించారు. శుక్రవారం మొత్తం 73.82 శాతంతో 8,949 బస్సులు నడిచినట్లు అధికారులు వెల్లడించారు. ఇందులో 6,846 ఆర్టీసీ బస్సులు, 2,103 అద్దె బస్సులు ఉన్నాయి. 4,623 మంది తాత్కాలిక డ్రైవర్లు, 6,606 మంది తాత్కాలిక కండక్టర్లు విధులు నిర్వర్తించారు. 1921 బస్సుల్లో టికెటింగ్ విధానం, 1690 బస్సుల్లో టిమ్స్ ద్వారా టికెట్లు జారీచేసినట్లు ఆర్టీసీ ఉన్నతాధికారులు తెలిపారు. అతి త్వరలో వందశాతం బస్సులు నడపాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్‌లో శుక్రవారం సుమారు రెండువేల బస్సులు రోడ్డెక్కినట్టు అధికారులు తెలిపారు.

బంద్‌ను విజయవంతం చేయండి: అశ్వత్థామరెడ్డి

శనివారం తలపెట్టిన బంద్‌ను అన్నివర్గాల ప్రజలు విజయవంతం చేయాలని ఆర్టీసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి కోరారు. ఆర్టీసీలో ప్రతి ఒక్కరు నాయకులేనని, ప్రజారవాణా వ్యవస్థను కాపాడేందుకే తమ పోరాటమని చెప్పారు. శుక్రవారం సుందరయ్య విజ్ఞానకేంద్రంలో నిర్వహించిన సకల జనుల సమరభేరి కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం కార్మికుల హక్కులను కాపాడాలని, డిమాండ్లను నెరవేర్చాలని కోరారు. అనంతరం ఆర్టీసీ కార్మికుల బైక్‌ర్యాలీని అశ్వత్థామరెడ్డి ప్రారంభించారు. పోలీసులు అడ్డుకున్నా వెనక్కి తగ్గకపోవటంతో అశ్వత్థామరెడ్డితోపాటు సహ కన్వీనర్ రాజిరెడ్డి, వెంకన్నను అరెస్టుచేశారు.

బలవంతపు బంద్ చేయిస్తే కఠినచర్యలు

ఆర్టీసీ కార్మిక సంఘాలు ఇచ్చిన బంద్ పిలుపు నేపథ్యంలో ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. బలవంతంగా బంద్‌చేయిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ పోలీస్ కమిషనర్లు అంజనీకుమార్, మహేశ్‌భగవత్, సజ్జనార్ హెచ్చరించారు. బంద్‌లో పాల్గొనేవారు హింసాత్మక చర్యలకు పాల్పడినా, సామాన్యులను రెచ్చగొట్టేలా ప్రవర్తించినా చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు. సామాన్య ప్రజలను ఎవరైనా ఇబ్బందిపెడితే డయల్ 100కు సమాచారం ఇవ్వాలని సూచించారు. శనివారం తెల్లవారుజాము నుంచి అర్ధరాత్రి వరకు అన్ని విభాగాల పోలీస్ సిబ్బంది విధుల్లో పాల్గొంటారని తెలిపారు. బస్‌డిపోలు, బస్టాండ్ల దగ్గర ప్రత్యేక నిఘా, పటిష్ఠ భద్రతతోపాటు సమస్యాత్మక ప్రాంతాల్లో మౌంటెడ్ కెమెరా వాహనాలు అందుబాటులో ఉంటాయన్నారు. ప్రజలు ధైర్యంగా ఉండాలని, బలవంతపు బంద్‌లకు ఎవరూ తలొగ్గొద్దని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *