క్షేత్రస్థాయిలోనే కరోనాకు కళ్లెం వేయాలి

ఉన్నతాధికారులకు రిజ్వి దిశానిర్దేశం
నల్గొండ, అక్షిత ప్రతినిధి :
కరోనా సెకండ్ వేవ్ పాజిటివ్ కేసులు పెరగకుండా గ్రామ స్థాయి నుండి వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బంది పోలీస్, రెవెన్యూ, పంచాయతీ రాజ్ శాఖల సమన్వయంతో కట్టుదిట్టంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వైద్య,ఆరోగ్య శాఖ కార్యదర్శి ఎస్.ఏ.యం.రిజ్వీ అధికారులను ఆదేశించారు. సోమవారం నల్గొండ జిల్లాకు విచ్చేసిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి హాలియాలో ఎం.పి.డి.ఓ కార్యాలయం లో ప్రజారోగ్య సంచాలకులు డా.జి.శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్,స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి వైద్య ఆరోగ్య శాఖ మెడికల్ ఆఫీసర్ లతో సమీక్ష సమావేశం నిర్వహించి జిల్లాలో కోవిడ్ కేసుల వ్యాప్తి, నియంత్రణ చర్యల పై పి.హెచ్.సి.ల వారీగా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖర్ రావు ఆదేశాల ననుసరించి నాగార్జున సాగర్ నియోజక వర్గంలో హాలియా లో కోవిడ్ కేసుల పై సమీక్ష నిర్వహిస్తున్నట్లు, సరిహద్దు ప్రాంతంలో కోవిడ్ కేసులు ఎక్కువగా పెరగకుండా నియంత్రణ చర్యలు తీసుకోవాలని అన్నారు. వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది బాగా పని చేస్తున్నట్లు, కోవిడ్ నియంత్రణకు ఇంకా అవగాహన కల్పించి చర్యలు తీసుకోవాలని అన్నారు. కోవిడ్ మహమ్మారి వలన కుటుంబంలో వ్యక్తి చనిపోతే ఎంత బాధ ఉంటుందో అర్థం చేసుకొని వైద్య అధికారులు కోవిడ్ రోగులకు సేవలు అందించాలని అన్నారు.ముఖ్యంగా జిల్లాలో పట్టణ ప్రాంతాల్లో నల్గొండ లో మాన్యంచెల్క,పానగల్,మిర్యాలగూడ,సాగర్,దేవరకొండ ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో డిండి, మునుగోడ్, నార్కట్ పల్లి,కొండ మల్లే పల్లి ప్రాంతాల్లో ఎక్కువగా కేసులు నమోదు జరుగుతున్నట్లు అధికారులు వివరించారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి మాట్లాడుతూ పట్టణ ప్రాంతాలలో అవగాహన,చైతన్యం తో కేసులు సంఖ్య తగ్గుతున్నట్లు, గ్రామీణ ప్రాంతాల పై ప్రత్యేకంగా దృష్టి సారించాలని ఆయన అన్నారు. కోవిడ్ కేసులు ఎక్కువగా నమోదు అయిన ప్రాంతాలను హాట్ స్పాట్ లుగా గుర్తించి కరోనా నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అన్నారు.జిల్లాలో గ్రామాల్లో క్యాంపులు ఏర్పాటు చేసి కోవిడ్ పరీక్షలు నిర్వహించాలని,అదనపు టెస్ట్ కిట్ లు అవసరం ఉంటే సరఫరా చేయనున్నట్లు తెలిపారు. కోవిడ్ పరీక్షలు చేసి పాజిటివ్ కేసులకు కోవిడ్ మందులు,హోం ఐ సోలేషన్ లో ఉండేలా వ్యాధి సోకిన వారికి అవగాహన కల్పించాలని సూచించారు.ముఖ్యంగా పెండ్లిళ్ళు జరిగే చోట దృష్టి సారించి లాక్ డౌన్ నిబంధనలు మేరకు సూచించిన సంఖ్య కంటే ఎక్కువ సంఖ్యలో హాజరైతే పోలీస్,రెవెన్యూ,పంచాయతీ రాజ్ శాఖలు సమన్వయంతో కేసులు నమోదు చేయాలని అన్నారు.పెండ్లిళ్ళు ద్వారా కరోనా కేసులు ఎక్కువగా వ్యాప్తి చెందుతున్నట్లు ఆయన తెలిపారు.జిల్లాలో సరాసరి 15 నుండి 18 శాతం పాజిటివ్ కేసుల శాతం 5 శాతం కు తగ్గించాలని అన్నారు.జిల్లాలో కొనసాగుతున్న ఫివర్ సర్వే మొక్కుబడి గా కాకుండా వైద్య సిబ్బంది కుటుంబంలో జ్వర పీడితులను గుర్తించాలని అన్నారు.ఫివర్ సర్వే లో 40 వేల జనాభా లో 80 మంది కి మాత్రమే జ్వరం వచ్చినట్లు తెలుపుతున్నారని,ఖచ్చితత్వం తో సర్వే నిర్వహించాలని అన్నారు.
జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ మాట్లాడుతూ జిల్లాలో లాక్ డౌన్ ప్రభుత్వ ఆదేశాల మేరకు పకడ్బందీ గా అమలు చేస్తున్నట్లు,లాక్ డౌన్ ముందు 30 నుండి 35 శాతం ఉన్న కేసులు లాక్ డౌన్ తర్వాత 15 నుండి 18 శాతం తగ్గిందని, వచ్చే 10 రోజుల్లో 5 శాతం కు తగించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.జిల్లాలో ప్రభుత్వ ఆదేశాల ననుసరించి కోవిడ్ నియంత్రణకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు వైద్య అధికారులు వివరించారు.ఈ సమావేశం లో డి.సి.హెచ్.ఎస్.మాతృ నాయక్,జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.కొండల్ రావు,వివిధ ప్రాంతాల నుండి వచ్చిన వైద్య శాఖ అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *