క్షవర, లాండ్రీ, దోభీ ఘాట్లకు 250 యూనిట్ల విద్యుత్ ఫ్రీ

నాయి బ్రాహ్మణ, రజక వృత్తిదారులకు చేయూత

సీఎం కేసీఆర్  ఆదేశాలతో ఉత్తర్వులు జారీ

హైదరాబాద్, అక్షిత ప్రతినిధి : రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోని క్షవర వృత్తి శాలలకు (కటింగ్ షాపులకు), లాండ్రీ షాపులకు, దోభీఘాట్లకు నెలకు 250 యూనిట్ల వరకు నాణ్యమైన విద్యుత్తును ఉచితంగా ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. రాష్ట్ర వ్యాప్తంగా రజక సంఘాలు, నాయీ బ్రాహ్మణ సంఘాలు ప్రభుత్వానికి ఇప్పటికే చేసిన విజ్జప్తులను పరిశీలించిన మీదట సీఎం కేసీఆర్ ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇందుకు సంబంధించి తక్షణమే జీవో జారీ చేయాల్సిందిగా సీఎంవో కార్యదర్శి భూపాల్ రెడ్డికి సీఎం కేసీఆర్ ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు అందుకు సంబంధించిన జీవోను బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ బుర్ర వెంకటేశం విడుదల చేశారు. ఈ ఉచిత విద్యుత్తు సరఫరా ఏప్రిల్1 నుంచే అమల్లోకి రానున్నది.

అత్యంత బలహీన వర్గాల అభ్యున్నతే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని వారి సంక్షేమం కోసం ఇప్పటికే అనేక పథకాలను అమలు పరుస్తున్నామని సీఎం తెలిపారు. తాజా నిర్ణయం ద్వారా గ్రామ స్థాయి నుంచి జీహెచ్ఎంసీ దాకా ఉన్న కటింగు షాపులకు, లాండ్రీ షాపులకు, దోభీ ఘాట్ల కు 250 (రెండు వందల యాభై) యూనిట్ల వరకు నాణ్యమైన కరెంటు ఉచితంగా అందుబాటులోకి రానున్నదన్నారు. తద్వారా , తర తరాలుగా కుల వృత్తిని ఆధారంగా చేసుకుని జీవనం కొనసాగిస్తున్న తెలంగాణలోని లక్షలాది రజక, నాయీ బ్రాహ్మణ కుటుంబాలకు లబ్ధి చేకూరనున్నదని అన్నారు. సాంకేతికాభివృద్ది కారణంగా పలు రకాల యంత్రాలు వీరి కుల వృత్తుల నిర్వహణలో దోహదపడుతున్న నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న ఉచిత విద్యుత్తు నిర్ణయం ద్వారా వృత్తిదారులకు శారీరక శ్రమ తగ్గి, ఆర్ధిక వెసులు బాటు కూడా కలగనున్నది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *