కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ మరో ఘనత

అక్షిత ప్రతినిధి, లండన్‌: టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ మరో అరుదైన ఘనతను సాధించాడు. ఈ దశాబ్దపు అత్యుత్తమ ప్రతిభా పాటవాలు కలిగిన క్రికెటర్‌గా విజ్డన్‌ క్రికెటర్స్‌ ఆల్మానిక్‌(దీన్ని ది బైబిల్‌ ఆఫ్‌ క్రికెట్‌గా పేర్కొంటారు) అతని పేరును ప్రకటించింది. కోహ్లీతో పాటు మరో నలుగురు కూడా ఈ జాబితాలో ఉండటం విశేషం. దక్షిణాఫ్రికాకు చెందిన డేల్‌ స్టెయిన్‌, ఏబీ డివిలియర్స్‌, ఆస్ట్రేలియా స్టీవ్‌ స్మిత్‌తో పాటు మహిళా ఆల్‌రౌండర్‌ ఎల్సీ పెర్రీలకి చోటు దక్కింది. గత పదేళ్లలో అంతర్జాతీయంగా కోహ్లీ 5,775 పరుగులు చేయడం ద్వారా అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. అంతేకాదు, ఈ దశాబ్దపు విజ్డన్‌ టెస్ట్‌ టీమ్‌తో పాటు వన్డే ఎలెవన్‌ కెప్టెన్‌గా కోహ్లీ పేరును విజ్డన్‌ క్రికెటర్స్‌ ఆల్మానిక్‌ ప్రకటించింది.

‘‘అతను ఒక మేధావి. సవాళ్లు ఎదురైన రోజు తనేంటో చూపిస్తాడు. 2014 ఇంగ్లాండ్‌ టూర్‌ నుంచి నవంబరులో బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టు వరకూ అతని సగటు 63గా ఉంది. ఇందులో 21 సెంచరీలు, 13 అర్ధ శతకాలు ఉన్నాయి. అతను అరుదైన గణాంకాలను నమోదు చేశాడు. అంతర్జాతీయ అన్ని ఫార్మాట్‌లలో సగటు 50 కలిగిన ఏకైక బ్యాట్స్‌మెన్‌. ఈ విషయంలో స్టీవ్‌ స్మిత్‌ కోహ్లీకి కాస్త దగ్గరగా ఉన్నాడు’’అని విజ్డన్‌ పేర్కొంది.

సచిన్‌ క్రికెట్‌కు వీడ్కోలు, ధోని ఆట సన్నగిల్లడం తర్వాత కోహ్లీలా మరే క్రికెటర్‌ ఇంత ఒత్తిడిలో ఆడటం లేదని విజ్డన్‌ తెలిపింది. గత పదేళ్లలో టెస్టుల్లో 7,202 పరుగులు చేసిన కోహ్లీ అందులో 27 శతకాలు నమోదు చేశాడు. ఇక వన్డేల్లో ఏకంగా 11,125 పరుగులతో, టీ20ల్లో 2,633 పరుగులతో ఉన్నారు. అంతేకాదు, శతకాల విషయంలో రికీ పాంటింగ్‌(71)ను దాటేందుకు కోహ్లీ(70) కేవలం ఒక్కడ అడుగు దూరంలో ఉన్నాడు. అందరికంటే ముందు సచిన్‌(100) ఉన్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *