కృష్ణమ్మ పరవళ్లు

అక్షిత ప్రతినిధి, హైదరాబాద్ :  కృష్ణానది పరవళ్లు తొక్కుతోంది. ఆలమట్టి నుంచి దిగువకు 2.85 లక్షల క్యూసెక్కుల భారీ ప్రవాహం వస్తోంది. దాదాపు అంతే మొత్తంలో నారాయణపూర్‌ జలాశయం నుంచి జూరాలకు విడుదలవుతోంది.  ఆదివారం రాత్రికల్లా శ్రీశైలం జలాశయంలో నీటి నిల్వ 100 టీఎంసీలకు చేరింది. మరోవైపు గోదావరిలో ప్రవాహం కొనసాగుతోంది. శ్రీపాద ఎల్లంపల్లి జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకుంది. కడెం నుంచి వచ్చిన వరదతో రెండు రోజుల్లోనే ఈ జలాశయం జలకళను సంతరించుకుంది. ఉదయం సమయానికి 54 వేల క్యూసెక్కుల వరద ఉండగా రాత్రి 8 గంటలకు 23 వేల క్యూసెక్కులకు తగ్గిపోయింది. శ్రీరామసాగర్‌కు కూడా ఒక్కసారిగా వచ్చిన వరద తగ్గింది. స్థానికంగా వర్షాలు కురవడంతో శనివారం భారీ ప్రవాహం వచ్చింది. దాదాపు రెండు టీఎంసీల వరకు నిల్వ పెరిగింది. కాళేశ్వరం పుష్కరఘాట్ల వద్ద గోదావరి 10.41 మీటర్ల స్థాయిలో ప్రవహిస్తోంది. పేరూరు వద్ద 10.59 లక్షల క్యూసెక్కుల ప్రవాహం నమోదైంది. ఆదివారం సాయంత్రం 5 గంటలకు భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 42.8 అడుగులు ఉంది. దీంతో మొదటి ప్రమాదహెచ్చరికను ఉపసంహరించారు.

మేడిగడ్డ బ్యారేజీ 81 గేట్ల ఎత్తివేత
మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తుండటంతో ప్రాణహితకు వరద పోటెత్తుతోంది. దీంతో ఆదివారం రాత్రి మేడిగడ్డ బ్యారేజీ 85 గేట్లలో 81 గేట్లను తెరిచారు. ఇన్‌ఫ్లో 8.26 లక్షల క్యూసెక్కులు ఉండగా అవుట్‌ ఫ్లో కూడా 8.26 లక్షల క్యూసెక్కులుగా ఉంది. రాత్రి అన్నారం బ్యారేజీలో నాలుగు గేట్లను ఎత్తారు. ఇక్కడ ఇన్‌ఫ్లో 6,514 క్యూసెక్కులు ఉండగా అవుట్‌ఫ్లో 18 వేల క్యూసెక్కులుగా ఉంది.

 

tags : krishna river

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *