కుంగుబాటే.. అసలైన శత్రువు

  • ప్రతికూల భావాలతోనే బలవన్మరణాలు
  • చిన్నపాటి సమస్యలకూ భయపడుతున్న యువత
  • ఒత్తిడిని అధిగమించడంపై దృష్టి పెట్టాలంటున్న నిపుణులు

‘ఆశ క్యాన్సర్‌ ఉన్నవారిని కూడా బతికిస్తుంది.. భయం అల్సర్‌ ఉన్న వారినైనా చంపేస్తుంది’… ఇదో సినిమా డైలాగ్‌. దీనికి ఇంచుమించు సరిపోయేలా నేటి సమాజ పరిస్థితులున్నాయి. వ్యక్తి తన మనసులోకి చొప్పించే ఆలోచనలు కొన్నిసార్లు ప్రాణాలు తీస్తున్నాయి. ఎవరికీ లేనన్ని కష్టాలు నాకే ఉన్నాయి… వీటి నుంచి బయట పడటం కల్ల.. నావి పరిష్కారం లేని సమస్యలు.. ఇలాంటి అపోహలతోనే ప్రాణాలు తీసుకొంటున్నారు నేటి తరం. దీనంతటికీ కారణం ఒత్తిడి. పనిలో కావచ్చు.. వ్యక్తిగత సమస్యల వల్ల తలెత్తవచ్చు… కుటుంబ సమస్యలతో.. ఇలా ఒత్తిడికి చాలా రూపాలున్నాయి.
ఓ టీవీ ఛానల్‌లో పనిచేసే యాంకర్‌ రాధిక ఆదివారం రాత్రి ఆత్మహత్య చేసుకున్న విషయం విదితమే. కేవలం కుంగుబాటు కారణంగానే బలవన్మరణానికి పాల్పడుతున్నట్లు ఆమె సూసైడ్‌ నోట్‌లో పేర్కొన్నారు.. ఒక్క రాధిక మాత్రమే కాదు.. ఒత్తిడిని భరించలేక ఇలా నగరంలో ఆత్మహత్యలు చేసుకొంటున్న వారు చాలామంది ఉంటున్నారు. సమస్యలను సమర్థంగా ఎదుర్కొనే నైపుణ్యాలు, అధిగమించే మనోస్థైర్యం కొరవడి ఇలాంటి నిర్ణయాలు తీసుకొంటున్నారు.

ఎందుకిలా..?
* కొందరిలో సున్నిత మనస్తత్వం ఉంటుంది. చిన్న మాట అన్నా ఓర్చుకోలేరు. చేసేపనిలో లోపం లేకుండా చూసుకొంటారు. అయినా కొన్నిసార్లు పైఅధికారులతో తిట్లు తినాల్సి వస్తుంటుంది. అలాంటి వారు తొందరగా ఒత్తిడికి గురయ్యే అవకాశాలుంటాయని నిపుణులు చెబుతున్నారు.

* కొంతమందికి స్నేహితులు, సన్నిహితులు అంతగా ఉండరు. దీంతో బాధలను, సంతోషాలను ఎవరితోనూ పంచుకోలేరు. ఏదైనా కష్టం వస్తే వారిలో వారే బాధపడతారు.
* చేసే ఉద్యోగంలో సంతృప్తి లేనివారు, అయిష్టంగా పనులు చేస్తుంటారు. ఇలాంటి వారికి కాస్త భారమైన పని అప్పగించినా కోపం, చిరాకు, అసహనం పెరిగి కుంగుబాటుకు దారి తీస్తుంది.

* కొన్నిసార్లు ఎంతబాగా పనిచేసినా అవతలి వారికి నచ్చదు. అలాంటప్పుడు నాకే ఎందుకిలా జరుగుతుందనే ఆవేదన కలుగుతుంది. ఆందోళన ఎక్కువై ఆలోచనలు అదుపుతప్పుతాయి.
* ఒత్తిడికి గురయ్యే వారిలో కనిపించే ప్రధాన లోపం ఆలోచనసరళి వారి నియంత్రణలో లేకపోవడం. ఒకదాని తర్వాత ఒకటి మెదడులో చేరి భారాన్ని పెంచుతాయి. వెంటనే నియంత్రణ కోల్పోయి ప్రతికూల ఆలోచనలు వస్తాయి.

* మగవారితో పోల్చితే ఆడవారిలో ఒత్తిడి మూడు రెట్లు అధికంగా ఉంటుంది. ఆందోళన, భయం, ఆత్మన్యూనతా భావం ఎక్కువ. చిన్న కష్టాలనూ కొందరు తట్టుకోలేరు.

* మనసులో చేరే ప్రతికూల ఆలోచనలు ఆశను తినేస్తాయి. అసలు భవిష్యత్తే లేదనే భావన కలిగిస్తాయి.
* స్త్రీలు ఇంటిని చక్కదిద్దుకొంటూ.. కార్యాలయ విధుల్లో రాణించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఎక్కువ ఆందోళనకు గురవుతారు.

పరిష్కారం మీ చేతుల్లోనే …
* ప్రపంచంలో పరిష్కారం లేని సమస్య లేదు. ఒత్తిడి సమస్యకూ పరిష్కారం మన చేతుల్లోనే ఉంది.

* ప్రతి ఒక్కరూ పని మాత్రమే కాకుండా ఏదో ఒక హాబీని అలవాటు చేసుకోవాలి. చిత్రలేఖనం, పాటలు పాడటం, వారాంతాల్లో సినిమాలు చూడటం, కథలు, డైరీ రాయడం వంటివి అలవాటు చేసుకోవాలి.
* వారాంతాల్లో కుటుంబంతో కలిసి ఏదైనా విహారయాత్రకు లేదా బయటికి వెళ్లాలి.

* చక్కని ఆహార నియమాలు పాటించాలి. సమయానికి తినాలి.
* హాస్యచతురతను పెంచుకోవాలి.

* మనసు విప్పి మాట్లాడే స్నేహితులు, సన్నిహితులతో కష్టాలు, బాధలను పంచుకొంటే కొంత బరువు దిగినట్లు అనిపిస్తుంది.
* బాగా ఇష్టమైన పనులను రోజూ చేస్తూ ఉండాలి. కవితలు, పాటలు రాయడం, వాటికి బాణీలు కట్టడం వంటివి ఆహ్లాదాన్నిస్తాయి.

స్నేహపూర్వకంగా ఉండాలి: డా.కల్యాణ్‌చక్రవర్తి, మనస్తత్వ నిపుణులు
పని చేసేచోట స్నేహపూర్వక వాతావరణం అవసరం. అలా ఉంటే ఎంత ఒత్తిడైనా ఇట్టే పోతుంది. పని చేసేప్పుడు విరామ సమయంలో పాటలు వినడం, ఏదైనా ఆట ఆడటం, సహోద్యోగులతో మాట్లాడటం చేయాలి. అల్లరి పనులు, హాస్యకరమైన సందర్భాలను చర్చించాలి. అలా అవకాశం లేని సందర్భాల్లో దీర్ఘ శ్వాసతీసుకోవాలి. కష్టపడి పని చేయడం కంటే..తెలివిగా చేయాలి. సృజనాత్మకతను పెంచుకునే ప్రయత్నం జరగాలి.

పరిష్కారం దొరుకుతుంది: వీరేందర్‌, మనస్తత్వ నిపుణులు
ప్రతికూల ఆలోచనలు మనిషిని కుంగదీస్తాయి. ఆత్మస్థైర్యం కోల్పోతారు. ఇలాంటి ఆలోచనలు వచ్చినప్పుడు నిపుణులను సంప్రదించాలి. సరైన నైపుణ్యాలు లేనివారిలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. విజయవంతమైన వ్యక్తుల కథలను చదవాలి. సంగీతం వినాలి. వ్యాయామం చేయాలి.. క్రీడలు ఆడాలి. నా మానసిక సమస్య తెలిస్తే ఇతరులు ఏమైనా అనుకుంటారేమో అని చాలామంది ఆలోచిస్తారు. అది సరికాదు. చాలా చిన్న చిన్న మార్గాలతో పరిష్కారం దొరుకుతుంది.

చెరగని చిరునవ్వు వెనక అంతులేని విషాదం!
మూసాపేట: చిరునవ్వులు చిందిస్తూ హుషారుగా కన్పించే టీవీ యాంకర్‌ రాధిక జీవితంలో అంతులేని విషాదం నెలకొందనే విషయాన్ని ఎవరూ ఊహించలేక పోయారు. సాధారణ కుటుంబం నుంచి వచ్చిన ఆమె బుల్లితెర వ్యాఖ్యాతగా ప్రశంసలు అందుకొన్నారు. మెదక్‌ జిల్లా మానేపల్లి గ్రామానికి చెందిన వెంకన్నగారి రాధిక ఎలియాస్‌ రాధికారెడ్డి (36) పదిహేనేళ్ల క్రితం అనిల్‌రెడ్డిని ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆరు నెలల క్రితం విడాకులు తీసుకున్నారు. ఆమె బ్యాగులో లభించిన సుసైట్‌ నోట్‌ బాగా నలిగిపోయి ఉండటాన్ని బట్టి .. ఆత్మహత్య ఆవేశంలో తీసుకున్న నిర్ణయం కాదని.. కొద్ది రోజుల ముందు నుంచి ఉన్నట్లు పోలీసులు అభిప్రాయపడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *