కాంగ్రెస్ సిట్టింగులు ఔటే

హైదరాబాద్, నమస్తే తెలంగాణ:వచ్చే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి వందకుపైగా సీట్లు గెలువబోతున్నదని, కాంగ్రెస్ సిట్టింగ్ స్థానాలను సైతం గెలుచుకుంటుందని పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. కేంద్ర సంస్థలు, స్థానిక ప్రైవేటు సంస్థలు చేసిన సర్వేలన్నింటిలోనూ ప్రజలు టీఆర్‌ఎస్‌కు బ్రహ్మరథం పడుతున్నట్టు ఫలితాలు వచ్చాయని తెలిపారు. సర్వేలన్నింటిలోనూ వందకుపైగా స్థానాల్లో గెలుస్తామని తేలిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం తెలంగాణభవన్‌లో టీఆర్‌ఎస్ అభ్యర్థులతో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి పార్టీ ఎంపీలను కూడా ప్రత్యేకంగా ఆహ్వానించారు. సమావేశంలో జహీరాబాద్, మలక్‌పేట స్థానాలకు కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించారు. రాబోయే 45 రోజులు పార్టీకి, అభ్యర్థికి చాలా కీలకమని, ఏ ఒక్కరోజూ సెలవులేకుండా ప్రచారం నిర్వహించాలని కేసీఆర్ సూచించినట్టు విశ్వసనీయంగా తెలిసింది.
నాలుగున్నరేండ్లలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలుచేసిన పథకాలతో ఒక్కో నియోజకవర్గంలో కనీసం 60వేల మంది వరకు లబ్ధిపొందారని, వీరికి రైతుబంధు లబ్ధిదారులు అదనంగా ఉన్నారని చెప్పారు. నియోజకవర్గాల లబ్ధిదారుల జాబితాను అందచేస్తున్నామని, ప్రభుత్వం నుంచి లబ్ధిపొందిన వారందరికీ ప్రభుత్వంపై కృతజ్ఞత ఉంటుందని, పార్టీ అభ్యర్థులు, నాయకులు వారిని తప్పనిసరిగా కలిసి టీఆర్‌ఎస్‌కు ఓటువేయాలని విజ్ఞప్తిచేయాలని సూచించారు. టీఆర్‌ఎస్ మ్యానిఫెస్టోకు అద్భుతమైన స్పందన వస్తున్నదని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని, ప్రతిపక్షాలు చేసే తప్పుడు ప్రచారాన్ని ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలన్నారు. సామాజిక మాధ్యమాల్లోనూ ఎప్పటికప్పుడు స్పందిస్తూ ఉండాలని చెప్పారు. ఏ ఒక్క ఓటరును కూడా నిర్లక్ష్యం చేయవద్దని, బ్యాక్‌ఆఫీస్, ఫ్రంట్ ఆఫీసులకు చురుకైన, నమ్మకస్థులైన వారిని నియమించుకోవాలని సూచించారు.

కులసంఘాలవారీగా సమావేశాలు
ప్రతి నియోజకవర్గంలో బహిరంగసభల్లో స్వ యంగా పాల్గొంటానని సీఎం కేసీఆర్ తెలిపారు. నియోజకవర్గాలవారీగా తేదీలను త్వరలో ఖరా రు చేసి తెలుపుతామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఆసరా పింఛన్లు పొందుతున్నవారు 40 లక్షల మంది ఉన్నారని, వారందరికీ ప్రస్తుతం ఇస్తున్న మొత్తాన్ని రూ.2016కు, రూ.3016కు పెంచుతున్నామని, అభ్యర్థులు స్వయంగా వారిని కలిసి ఈ విషయం వివరించాలని అన్నారు. కులసంఘాలవారీగా సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలని, ఆ సంఘాలకు ప్రభుత్వపరంగా చేసిన సాయాన్ని తెలుపాలని చెప్పారు. ఆర్యవైశ్యులు, గొల్ల కుర్మలు, మైనార్టీలు ఇలా వివిధవర్గాలతో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించి వారు టీఆర్‌ఎస్‌కు ఓటువేసే విధంగా చూసుకోవాలన్నారు. జిల్లాల్లో అభ్యర్థుల గెలుపు బాధ్యతలను జిల్లా మంత్రులు, ఎంపీలు ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవాలని సూచించారు.

వంద సీట్లు సాధించడం లక్ష్యం
టీఆర్‌ఎస్ ప్రభుత్వం రావడం ఖాయమైందని, ఇందుకు అవసరమైన సీట్లు వస్తాయని.. కానీ తన లక్ష్యం వందసీట్లు సాధించడమేనని కేసీఆర్ తెలిపారు. ఈ విషయాన్ని అభ్యర్థులంతా గుర్తుంచుకోవాలన్నారు. 2014లో టీఆర్‌ఎస్‌కు 63 సీట్లు వస్తే ప్రభుత్వాన్ని పడగొట్టడానికి టీడీపీ, కాంగ్రెస్‌లు ప్రయత్నం చేశాయని ఈ సందర్భంగా చెప్పారు. ప్రభుత్వాన్ని పడగొట్టే విషయాన్ని ఢిల్లీలో తెలుసుకున్న ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ తనకు ఫోన్‌చేసి సమాచారమిచ్చారని, టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి మద్దతిస్తామని ముందుకొచ్చారని తెలిపారు.
ఈసారి సర్వేలు వందకుపైగా సీట్లు వస్తాయని చెపుతున్నాయని, సర్వేలే చెప్పడం కాదని.. మనందరం కూడా వందసీట్లు లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. ప్రజల నుంచి స్పందన అద్భుతంగా ఉన్నదని, అసెంబ్లీ ఎన్నికల్లో వంద సీట్లు గెలుచుకోవడంతోపాటు, రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లోనూ పెద్దఎత్తున ఎంపీ సీట్లు కూడా గెలుచుకోబోతున్నామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో ఫెడరల్ ఫ్రంట్‌లో కీలక భూమిక పోషిస్తుందన్నారు. పార్టీకి రెండు మూడు కేంద్ర మంత్రి పదవులు కూడా లభిస్తాయని, కేంద్రం నుంచి అధికమొత్తంలో నిధులు రాబట్టుకుని, రాష్ర్టాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుందని కేసీఆర్ తెలిపారు.

అభ్యర్థులకు లబ్ధిదారుల బుక్‌లెట్
టీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలుచేసిన పథకాలతో ప్రయోజనం పొందిన లబ్ధిదారుల వివరాలతో నియోజకవర్గాలవారీగా రూపొందించిన బుక్ లెట్లను సమావేశంలో అభ్యర్థులకు అందజేశారు. అందులో ప్రభుత్వ పథకాల సమగ్ర వివరాలను పొందుపరిచారు. ఆసరా, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, కేసీఆర్ కిట్స్, సీఎంఆర్‌ఎఫ్, ఆరోగ్యశ్రీ పథకాలతోపాటు, జీతాలు పెంచడంతో లబ్ధిపొందుతున్న అంగన్‌వాడీ, ఆశ, హోంగార్డుల పేర్లు కూడా ఉన్నాయి.

అసరా లబ్ధిదారుల ఓటింగ్ ఫస్ట్
బూత్‌స్థాయిలో ప్రణాళికను రూపొందించుకోవాలని సీఎం కేసీఆర్ అభ్యర్థులకు సూచించారు. ప్రతి ఒక్కఓటు విలువైనదేనని, ప్రతి ఓటరు యూనిట్‌గా ప్రణాళిక రూపొందించుకోవాలని చెప్పారు. అందరూ ఓటుహక్కు వినియోగించుకునేలా చూడటంతోపాటు, ఆ ఓటు టీఆర్‌ఎస్‌కు వేసేలా చూడాలని తెలిపారు. పోలింగ్ ప్రారంభంలో అసరా పింఛన్ల లబ్ధిదారులు ఓటు వేసే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. నాలుగేండ్లుగా నెలకు వెయ్యి రూపాయల పింఛన్ తీసుకుంటున్నందున వారు తప్పకుండా టీఆర్‌ఎస్‌కు ఓటువేస్తారని తెలిపారు.
ఆ తరువాత ఇతర పథకాల లబ్ధిదారులు ఓటింగ్‌లో పాల్గొనేలా చూడాలని చెప్పారు. ఇలా పార్టీకి పూర్తిగా అనుకూలంగా ఉన్నవారి ఓట్లు మొదట్లోనే వేయించేలా కార్యకర్తలు, నాయకులు సమన్వయం చేసుకోవాలని తెలిపారు. పాజిటివ్ ఓటింగ్ పూర్తి అయిన తరువాత తటస్థులు, ప్రత్యర్థి పార్టీల ఓటర్లపై దృష్టి పెట్టాలని సూచించారు. ఎన్నికల నిబంధనలపై పూర్తి అవగాహన ఏర్పాటుచేసుకుని అందుకనుగుణంగా నడుచుకోవాలని, ప్రత్యర్థి పార్టీలు ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తే వెంటనే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయాలన్నారు. సర్వేల వివరాలను అభ్యర్థులకు ఇవ్వడంతోపాటు, ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ఉన్న అనుకూలతలు, వాస్తవాలను వివరిస్తూ సీఎం కేసీఆర్ వారిలో ఉత్సాహం నింపేందుకు పలు సూచనలు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *