కశ్మీర్ లో ఎన్ కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదులను కాల్చిచంపిన భద్రతా బలగాలు!

ఉగ్రవాదుల కాల్పుల్లో ఓ పోలీస్ దుర్మరణం
శ్రీనగర్ లోని ఫతేహ్ హడల్ లో ఘటన
ఇంటర్నెట్ సేవలు నిలిపివేసిన అధికారులు
జమ్మూకశ్మీర్ లో భద్రతాబలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఈరోజు ఎన్ కౌంటర్ చోటుచేసుకుంది. ఈ కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతం కాగా, టెర్రరిస్టుల కాల్పుల్లో ఓ పోలీస్ అధికారి ప్రాణాలు కోల్పోయాడు. శ్రీనగర్ లో ఉన్న ఫతేహ్ హడల్ ప్రాంతంలో ఉగ్రవాదులు దాక్కున్నట్లు నిఘా వర్గాల నుంచి భద్రతా బలగాలకు పక్కా సమాచారం అందింది. దీంతో ఆర్మీ, సీఆర్పీఎఫ్, పోలీసుల సంయక్త బలగాలు ఆపరేషన్ చేపట్టాయి. ఈ ప్రాంతాన్ని చుట్టుముట్టి గాలింపు ప్రారంభించాయి.

అయితే భద్రతా బలగాల కదలికలను గమనించిన ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరుపుతూ అక్కడి నుంచి పరారయ్యేందుకు యత్నించారు. కానీ అప్పటికే ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టిన బలగాలు ఎదురుకాల్పులు ప్రారంభించాయి. ఈ ఘటనలో ముగ్గురు ఉగ్రవాదులు చనిపోగా, ఉగ్రమూకలు జరిపిన కాల్పుల్లో ఓ పోలీస్ అమరుడయ్యాడు. ఈ ఘటనలో కొందరు జవాన్లకు స్వల్ప గాయాలయ్యాయి. వీరందరినీ శ్రీనగర్ లోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. ఎన్ కౌంటర్ నేపథ్యంలో ఇంటర్నెట్ సేవలను నిలిపివేసిన అధికారులు, విద్యాసంస్థలను మూసివేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *