imran

‘‘కశ్మీరుపై…భారత్ దూకుడు : ఇమ్రాన్

ఇస్లామాబాద్ : పాకిస్థాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ చాలా అమాయకత్వం నటిస్తున్నారు. అక్కడితో ఆగకుండా భారత దేశంపై దుర్బుద్ధితో ఆరోపణలు చేస్తున్నారు. జమ్మూ-కశ్మీరులో ప్రశాంతతను చెడగొట్టేందుకు పాకిస్థాన్ చేసిన ప్రయత్నాలను భారత్ సైన్యం విఫలం చేస్తున్న నేపథ్యంలో ఇమ్రాన్ వరుస ట్వీట్లలో భారత్‌పై విషం చిమ్మారు. భారత దేశమే దుశ్చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్యవర్తిత్వం కావాలంటున్నారు.
ఆదివారం ఇమ్రాన్ ఖాన్ మూడు ట్వీట్లు…
‘‘నియంత్రణ రేఖ వెంబడి అమాయక ప్రజలపై భారత దేశం దాడిని ఖండిస్తున్నాను. కొన్ని సంప్రదాయ ఆయుధాలపై 1983నాటి ఒప్పందం ప్రకారం భారత్ స్వయంగా ఇచ్చిన హామీలు, అంతర్జాతీయ మానవతావాద చట్టాలను ఉల్లంఘించి, భారత్ సైనిక ఆయుధాలను ఉపయోగించడాన్ని ఖండిస్తున్నాను. అంతర్జాతీయ శాంతి, భద్రతలకు కలుగుతున్న ముప్పును ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి గమనించాలి’’ అని మొదటి ట్వీట్‌లో ఇమ్రాన్ పేర్కొన్నారు. ‘‘ఆక్రమిత కశ్మీరు ప్రజల సుదీర్ఘ బాధల రాత్రికి తెరదించవలసిన సమయమిది. ఐక్య రాజ్య సమితి భద్రతా మండలి తీర్మానాల ప్రకారం స్వీయనిర్ణయాధికార హక్కును వినియోగించేందుకు వారిని అనుమతించాలి. దక్షిణాసియాలో శాంతి, భద్రతలకు ఏకైక మార్గం కశ్మీరుకు శాంతియుత, న్యాయమైన పరిష్కారం మాత్రమే’’ అని మరో ట్వీట్‌లో పేర్కొన్నారు. ‘‘కశ్మీరుపై మధ్యవర్తిత్వం చేస్తానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. భారతీయ ఆక్రమణ దళాలు కొత్తగా దూకుడు చర్యలు చేపడుతుండటంతో కశ్మీరులోనూ, నియంత్రణ రేఖ వెంబడి పరిస్థితి క్షీణిస్తున్నందువల్ల ఆ విధంగా చేయవలసిన సమయమిదే. ఇది ప్రాంతీయ సంక్షోభంగా విస్పోటనమయ్యే అవకాశం ఉంది’’ అని మూడో ట్వీట్‌లో పేర్కొన్నారు. జమ్మూ-కశ్మీరులో విధ్వంసానికి పాకిస్థాన్ కుట్రలు ప్రపంచానికి స్పష్టంగా వెల్లడవుతున్నప్పటికీ, ఇమ్రాన్ ఖాన్ భారత దేశ సైన్యాన్ని దురాక్రమణ దళంగా అభివర్ణించడం చాలా దారుణం.
tags : Imrankhan, India, Pak

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *