కలెక్టర్లతో సీఎం కేసీఆర్‌ సమావేశం

అక్షిత ప్రతినిధి, హైదరాబాద్‌ : అన్ని జిల్లాల కలెక్టర్లతో హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమావేశమయ్యారు. కొత్త రెవెన్యూ చట్టంపై వారి అభిప్రాయాలను తీసుకోనున్నారు. పంచాయతీ, పురపాలక చట్టాల అమలు, 60 రోజుల కార్యాచరణ ప్రణాళిక తదితర అంశాలపై చర్చిస్తున్నట్లు సమాచారం.ఈ సమావేశంలో పలువురు మంత్రులు, కలెక్టర్లు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ల కొత్త పాత్రను వివరించడంతో పాటు కొత్త రెవెన్యూ చట్టం రూపకల్పన, పంచాయతీరాజ్‌, పురపాలక చట్టాల అమలుతో పాటు సాగునీటి వినియోగ ప్రణాళిక అంశాలపై ఇందులో చర్చించనున్నారు. రెండు రోజుల పాటు జరిగే సమావేశాల ఎజెండాలో దాదాపు 32కి పైగా అంశాలున్నాయి. రాష్ట్రంలో రెండోసారి తెరాస ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. తొలిసారిగా కలెక్టర్లతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. రాష్ట్రంలో సుపరిపాలన లక్ష్యంతో సీఎం కొత్త పంచాయతీరాజ్‌, పురపాలక చట్టాలను రూపొందించిన విషయం తెలిసిందే. ఇందులో కలెక్టర్లకు కొత్త అధికారాలు కల్పించారు. ఇదే తరహాలో కొత్త రెవెన్యూ చట్టం సిద్ధమవుతోంది. దీన్ని సీఎం అత్యంత కీలకంగా భావిస్తున్నారు. దీనిపై ఇప్పటికే సుదీర్ఘ కసరత్తు జరిగింది. పార్లమెంటు ఎన్నికల సమయంలోనే కొత్త చట్టం గురించి వెల్లడించిన ముఖ్యమంత్రి దానికి అనుగుణంగా  రూపకల్పన చేపట్టారు. అధికారులు, నిపుణులతో చర్చలు జరిపారు. చట్టం కూర్పు తుది దశలో ఉండగా.. జిల్లా కలెక్టర్లు దీనిపై ఎలా పనిచేయాలనే దానిపై… వారి నుంచే అభిప్రాయాలను, సూచనలను, సలహాలను స్వీకరించి.. ఇందులో చేర్చాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలోనే రెండు రోజుల పాటు కలెక్టర్లతో సీఎం కేసీఆర్‌ సమావేశమవుతున్నారు.

 

tags : cm kcr,collectors meeting,pragathibhavan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *