కరోనా మరణాలు జరుగకుండా చూద్దాం

రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల

హైద‌రాబాద్, అక్షిత ప్రతినిధి :

రాష్ట్రంలో క‌రోనా వైర‌స్ వ‌ల్ల మ‌ర‌ణాలు జ‌ర‌గ‌కుండా చూద్దామ‌ని అన్ని ఆస్ప‌త్రుల సూప‌రింటెండెంట్‌ల‌ను వైద్య, ఆరోగ్య‌శాఖ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ కోరారు.  కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో టర్శరీ కేర్ హాస్పిటల్స్, టీవీవీపీ ఆస్పత్రుల సూపరింటెండెంట్లతో మంత్రి గురువారం టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్య‌క్ర‌మంలో సెక్రెటరీ రీజ్వి, డీఎంఈ రమేష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఇది గంభీరమైన సమయమ‌న్నారు. రిలాక్స్ కావొద్దన్నారు. మరోసారి యుద్ద వాతావరణంలో పని చేద్దామ‌ని పిలుపునిచ్చారు. అన్ని ఆస్పత్రుల్లో పీపీఈ కిట్స్, ఎన్‌ 95 మాస్క్ లు, లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంకులు, బల్క్ సిలెండర్లు, టాబ్లెట్స్, డాక్టర్లు, సిబ్బంది, బెడ్స్ కొరత లేకుండా చూడాలన్నారు. ఎంత మంది సిబ్బంది అవసరం అయినా తాత్కాలిక పద్దతిలో తీసుకోవాల‌ని సూచించారు. తర్వాత జిల్లా వైద్య అధికారులతో మంత్రి టెలికాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. ఈ కాన్ఫెరెన్స్ లో డైరెక్టర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ శ్రీనివాస్ పాల్గొన్నారు. డీఎంహెచ్‌వోల‌తో ఆరోగ్యశాఖ మంత్రి ఈటల మాట్లాడుతూ.. వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో గ్రామస్థాయిలో పని చేస్తున్న వైద్య సిబ్బంది ప్రధానపాత్ర పోషిస్తున్న‌ట్టు తెలిపారు. గ్రామాల్లో జ్వరం వచ్చిన ప్రతి ఒక్కరినీ, ప్రతి రోజూ పరిశీలించాల్సిందిగా సూచించారు. వైద్య ఆరోగ్యశాఖలో పని చేస్తున్న వారందరూ ప్ర‌స్తుతం సెలవులు పెట్ట‌కుండా ఉండాల్సిందిగా కోరారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆదివారం కూడా వాక్సిన్ వేయాలనే ఆదేశాలు ఉన్నాయి కాబట్టి అందరూ అన్ని రోజులు పని చేయాల‌న్నారు. ప్రజా జీవనం యథావిధిగా కొనసాగిస్తూనే కరోనా నియంత్రణ చేయాల్సి ఉందన్నారు. ఇతర రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న అన్ని జిల్లాల వైద్య,ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *