కరోనా కట్టడికి సమన్వయంతో పనిచేయాలి

కలెక్టర్లకు చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ దిశానిర్దేశం

హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కోవిడ్ -19 ను నియంత్రించడానికి తీసుకోవలసిన చర్యలపై జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, డీహెచ్ఓలు, జిల్లా ఆస్పత్రులు, ఏరియా ఆస్పత్రుల సూపరింటెండెంట్లతో బి.ఆర్.కె.ఆర్ భవన్ నుంచి శనివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కోవిడ్ నియంత్రణను సమర్థవంతంగా నిర్వహించడానికి అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాలు, మానవ వనరులను గరిష్టస్థాయిలో ఉపయోగించుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జిల్లా కలెక్టర్లకు స్పష్టం చేశారు. కోవిడ్ మహమ్మారిని ఎదుర్కోవటానికి అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు. రోగి ఆరోగ్య పరిస్థితిని పరిగణనలోకి తీసుకొని, సరైన వైద్య సేవలను అందించడానికి ప్రతి ఆస్పత్రిలో అనువైన వసతులను అందుబాటులో ఉంచాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. కరోనా కేర్ సెంటర్ (సిసిసి) లను ఉపయోగించుకోవాలని, తేలికపాటి లక్షణాలతో బాధపడుతున్న రోగులకు ఈ కేంద్రాల్లో చేర్పించి, చికిత్స అందించాలని సూచించారు. ఆస్పత్రికి వచ్చిన ప్రతి పేషంట్ ను చేర్చుకొని, చికిత్స అందించాలని తెలిపారు. అర్హులైన ప్రతి రోగికి సకాలంలో సరైన చికిత్స అందేలా చూడాలని ప్రధాన కార్యదర్శి జిల్లా కలెక్టర్లకు సూచించారు. కోవిడ్ పరిస్థితిని అంచనా వేయడానికి, సేవలను బలోపేతం చేయడానికి డీఎంహెచ్ఓలు, హాస్పిటల్ సూపరింటెండెంట్లు, ఆర్ఎంఓలు, ఇతర సంబంధిత అధికారులతో రోజుకు రెండుసార్లు మిని- టెలికాన్ఫరెన్స్ లు నిర్వహించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. కోవిడ్ నియంత్రణ చర్యలు, చికిత్స విధులలో ఇతర విభాగాల నుండి సిబ్బందిని తీసుకోనేందుకు, అవసరమైతే తాత్కాలిక ప్రాతిపదికన సిబ్బందిని నియమించడానికి జిల్లా కలెక్టర్లకు వెసులుబాటు కల్పిస్తున్నట్టు ప్రధాన కార్యదర్శి తెలిపారు.రాష్ట్రంలోని అన్ని ఆస్పత్రులలో తగినంత వైద్య ఆక్సిజన్ అందుబాటులో ఉండేలా తగు చర్యలు తీసుకోవాలని ప్రధాన కార్యదర్శి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఈ సమయంలో విలువైన ఆక్సిజన్ ను సక్రమంగా వినియోగించాల్సిన అవశ్యకతను గుర్తించాలని సూచించారు. ఒక్క యూనిట్ ఆక్సిజన్ కూడా వృథా కాకుండా చూడాలని నొక్కి చెప్పారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో ఆక్సిజన్ ను ఏవిధంగా ఎంతమేరకు సమర్థవంతంగా వినియోగిస్తున్నామనే దానిపైనే కోవిడ్ నియంత్రణ ఆధారపడి ఉన్నదని పేర్కొన్నారు. జిల్లాలలో ఉన్న ఆస్పత్రులలో వసతులతో ఉన్న ఖాళి వార్డులను కోవిడ్ వార్డులుగా మార్చి, ఆయా పడకలకు ఆక్సిజన్, ఐసియు వెంటిలేటర్స్ సదుపాయాలను కల్పించాలని జిల్లా కలెక్టర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశించారు. తద్వారా ఆసుపత్రులలో ఎక్కువ మంది రోగులను చేర్చుకోవచ్చునని తెలిపారు. బోధనా ఆస్పపత్రులలో లభించే అన్ని మౌలిక సదుపాయాలు, మానవ వనరులను ఉపయోగించుకోవాలని సూచించారు. రాబోయే రోజుల్లో కోవిడ్ పరిస్థితిని ఎదుర్కోనేందుకు ఆక్సిజన్ సౌకర్యంతో అదనంగా 12 వేల పడకలను సత్వరమే ఏర్పాటు చేయుటకు ప్రభుత్వం రూ .20 కోట్లు మంజూరు చేసినట్లు ప్రధాన కార్యదర్శి తెలిపారు. ఈ పనిని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆయన జిల్లా కలెక్టర్లకు ఆదేశించారు. వైద్య, ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వి, పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, స్టాంపులు, రిజిష్ట్రేషన్ల సీఐజీ శేషాద్రి, ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, ఆర్ధిక శాఖ స్పెషల్ సెక్రటరీ రోనాల్డ్ రోస్ , పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ రఘునందన్ రావు, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్, ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, డ్రగ్ కంట్రోల్ అడ్మినిష్ట్రేషన్ డైరెక్టర్ ప్రీతి మీనా, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ రావు, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డా. రమేశ్ రెడ్డి, ఆరోగ్య శాఖ అడ్వైజర్ టి. గంగాధర్, టీఎస్ఎంఎస్ఐడీసీ ఎండీ చంద్రశేఖర్ రెడ్డి, టీఎస్ ఐఐసీ నరసింహరెడ్డి , తదితర అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *