కరోనా ఆంక్షల నడుమ నవమి జరుపుకోవాలి

మిర్యాలగూడ నియోజకవర్గ ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు

నల్లమోతు భాస్కర్ రావు 

మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :

మిర్యాలగూడ నియోజకవర్గ ప్రజలకు శ్రీరామనవమి సందర్భంగా శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. నియోజకవర్గ ప్రజలంతా శ్రీరామ నవమిని భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. వసంత రుతువులో చైత్ర శుద్ధ నవమి రోజున ప్రతిఏటా వైభవోపేతంగా జరిగే శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని కరోనా ప్రభావం కారణంగా సామూహికంగా జరుపుకోలేకపోవడం బాధాకరమని అన్నారు. లోక కళ్యాణం కోసం ఎన్నోత్యాగాలను కోర్చిన సీతారాముల పవిత్ర బంధం అజరామరమైనదని,రాబోయే తరాలకు ఆదర్శనీయమైనదని భాస్కర్ రావు తెలిపారు.
సీతారాముల ఆశీస్సులు ప్రజలకు ఉండాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవనం సాగించేలా దీవించాలని సీతారామచంద్రమూర్తులను ప్రార్ధించనున్నట్టు భాస్కర్ రావు తెలిపారు. అదే విధంగా, కరోనా వైరస్ బారి నుంచి కాపాడుకునేందుకు స్వీయ నియంత్రణే శ్రీరామ రక్ష అని తెలిపారు. ప్రతీ ఒక్కరూ కోవిడ్ విజృంభణ దృష్ట్యా అప్రమత్తంగా ఉండి కుటుంబ సభ్యులతో కలిసి శ్రీరామనవమి జరుపుకోవాలని సూచించారు. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ మాస్కులు ధరించాలని, బహిరంగ ప్రదేశాల్లో కచ్చితంగా భౌతిక దూరం పాటించాలని కోరారు. భద్రాద్రిలో ప్రతీ ఏటా కన్నులపండువగా నిర్వహించే సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని, మరుసటి రోజున నిర్వహించే శ్రీరాముడి మహాపట్టాభిషేకం కార్యక్రమాన్ని కోవిడ్ దృష్ట్యా భక్తులు ఇండ్ల నుంచే వీక్షించే సదుపాయాన్ని ప్రభుత్వం కల్పించిందన్నారు. కరోనా నిబంధనల్లో భాగంగా భద్రాద్రి లోనూ పూజలు, తీర్ధ ప్రసాదాలను నిలిపివేశారని అన్నారు. మిర్యాలగూడ నియోజకవర్గ ప్రజలంతా సుఖ,సంతోషాలతో శ్రీరామనవమి జరుపుకోవాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *