ఒమన్ ఫ్యామిలీ హంతకుల్లో భారత వ్యక్తి.. విచారం వ్యక్తం చేసిన ఎంబసీ

మస్కట్: ఒమన్‌లోని ఉత్తర షార్కియాలోగల బిదియాహాకు చెందిన ఐదుగురు సభ్యులు గల ఓ కుటుంబాన్ని జూలై 29న ఆసియాకు చెందిన వ్యక్తులు అతి దారుణంగా హతమార్చి ఆ దేశం విడిచిపెట్టి పరారయ్యారు. దర్యాప్తు చేపట్టిన ఒమన్ పోలీసులకు ఈ హత్య కేసులో భారత వ్యక్తి కూడా ఉన్నట్లు తెలిసింది. దాంతో ఇండియన్ ఎంబసీ అధికారులను సంప్రదించారు. ఎంబసీ అధికారులు భారత పోలీసులకు సమాచారం అందించారు. వారి సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు గుజరాత్‌కు చెందిన నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై విచారం వ్యక్తం చేసిన ఒమన్‌లోని భారత ఎంబసీ ఓ ప్రకటన విడుదల చేసింది. ఒమన్ ఫ్యామిలీని చంపిన నిందితుల్లో ఇండియన్ ఉన్నందుకు చింతిస్తున్నట్లు పేర్కొంది.

ఈ సందర్భంగా ఎంబసీ అధికారులు మృతుల కుటుంబ సభ్యులకు, బంధువులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అలాగే ఈ కేసు విచారణకు భారత ప్రభుత్వం అన్ని విధాల సహకరిస్తుందని తెలిపింది. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని పేర్కొన్నారు. జూలై 29న ఏసీ రిపేర్ కోసమని వెళ్లిన ఆసియాకు చెందిన వ్యక్తులు ఐదుగురు కుటుంబ సభ్యుల(పేరెంట్స్, ముగ్గురు పిల్లలను)ను అతి కిరాతకంగా హతమార్చి అక్కడి నుంచి పరారయ్యారు. హంతకుల్లో ఒకరైన గుజరాత్‌కు చెందిన వ్యక్తి కూడా హత్య జరిగిన తరువాతి రోజే ఇండియాకు వచ్చేశాడు. జూలై 31న కుటుంబం మొత్తం హత్యకు గురైందన్న వార్త ఒమన్‌లో కలకలం సృష్టించింది.

ఈ కేసును ఛాలెంజింగ్ తీసుకున్న ఒమన్ పోలీసులు సీసీటీవీ దృశ్యాల ఆధారంగా కేసును దర్యాప్తు చేసి నిందితులను గుర్తించారు. నిందితులు హత్య అనంతరం వారి వారి దేశాలకు పారిపోయినట్లు నిర్ధారించి ఆయా దేశాల పోలీసులకు సమాచారం అందించారు. ఒమన్ పోలీసుల సమాచారంతో రంగంలోకి దిగిన గుజరాత్‌ పోలీసులు తాజాగా నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయం ఒమన్‌లోని భారత ఎంబసీ అధికారులకు తెలియజేశారు. ఈ సందర్భంగా ఇండియన్ ఎంబసీ విచారం వ్యక్తం చేస్తూ ప్రకటన విడుదల చేసింది. ఒమనీ ఫ్యామిలీ హత్యకేసులో భారత వ్యక్తి ఉన్నందుకు చింతిస్తున్నట్లు పేర్కొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *