అక్షిత ప్రతినిధి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు తాము ఎలాంటి ఆలోచనా చేయలేదని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి స్పష్టంచేశారు. ఆర్టీసీ ఇన్ఛార్జ్ ఎండీగా ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి సునీల్‌శర్మ.. ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రతిపక్షాలు కుట్ర చేస్తున్నట్లు హైకోర్టుకు అఫిడవిట్ సమర్పించడంపై ఆయన తీవ్ర అభ్యంతరం తెలిపారు. గాంధీభవన్‌లో సీనియర్ నేతలు వీహెచ్, పొన్నాలతో కలిసి ఉత్తమ్ మీడియాతో మాట్లాడారు. సునీల్ శర్మ సమర్పించిన తప్పుడు అఫిడవిట్‌ను సుమోటాగా స్వీకరించి న్యాయస్థానం చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
ఎవరి ప్రోద్బలంతో నిరాధార అంశంపై హైకోర్టులో అఫిడవిట్ వేశారని సునీల్‌శర్మను ఉత్తమ్ ప్రశ్నించారు. ఈ అంశాన్ని లోక్‌సభలోనూ లేవనెత్తుతానని చెప్పారు. ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు రాజకీయ పార్టీలు కుట్ర చేసినట్లు ఆధారాలు ఉంటే అరెస్ట్ చేయాలని.. లేదంటే వెంటనే సునీల్ శర్మను డిస్మిస్ చేయాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు. ఆర్టీసీ కార్మికుల పక్షాన నిరంతరం తమ పోరాటం కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేయాలని చూశారని ఆరోపించారు. తెలంగాణ తన జాగీర్ అన్నట్లు సీఎం వ్యవహరిస్తున్నారని ఉత్తమ్ ధ్వజమెత్తారు. ఈనెల 19న ఆర్టీసీ కార్మికులు చేపట్టనున్న సడక్‌బంద్‌కు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా మద్దతిస్తుందన్నారు. 24 మంది కార్మికులు మృతిచెందినా కేసీఆర్‌కు అహంకారం తగ్గలేదని విమర్శించారు. సునీల్ శర్మపై డీవోపీటీకి ఫిర్యాదు చేస్తామని ఉత్తమ్ స్పష్టం చేశారు.