ఎన్నికల నిర్వహణలో సెక్టర్ అధికారుల పాత్ర కీలకం

జిల్లా ఎన్నికల అధికారి,జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జె పాటిల్

నల్గొండ, అక్షిత ప్రతినిధి :ఎన్నికల నిర్వహణలో సెక్టర్ అధికారుల పాత్ర కీలకమని జిల్లా ఎన్నికల అధికారి,జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జె పాటిల్ అన్నారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నాగార్జునసాగర్ ఉప ఎన్నికల సెక్టర్ అధికారులకు నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెక్టర్ అధికారులు రిటర్నింగ్ అధికారి పరిధిలో విధులు నిర్వహించాలని, ఒక్కో సెక్టర్ అధికారికి 10 నుండి 12 పోలింగ్ కేంద్రాలకు బాధ్యతలను అప్పగించడం జరుగుతుందని, ఒక్కో సెక్టర్ అధికారికి ఒక రూట్ అధికారిని కూడా కేటాయించడం జరుగుతుందన్నారు. ప్రతి సెక్టర్ అధికారి తన పరిధిలోని అన్ని పోలింగ్ కేంద్రాలను కనీసం మూడు సార్లు సందర్శించాలని, పోలింగ్ కేంద్రాలలోని సౌకర్యాలపై నివేదికను సమర్పించాలన్నారు. అన్నారు. పోలింగ్ సిబ్బందిని, పోలింగ్ సామగ్రిని పోలింగ్ కేంద్రాలకు తరలించడానికి, పోలింగ్ కేంద్రం నుండి పోలింగ్ అనంతరం రిసెప్షన్ కేంద్రానికి తరలించడానికి రూట్ ప్లాన్ ను సిద్ధం చేసుకోవాలన్నారు. తమ సెక్టర్ పరిధిలో ఓటర్లకు ఈవీఎంల పై అవగాహన కల్పించడం, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ పర్యవేక్షణ, ప్రశాంత వాతావరణంలో పోలింగ్ పూర్తయ్యేలా చూసే బాధ్యత సెక్టర్ అధికారులది అని అన్నారు. మరీ ముఖ్యంగా సెక్టర్ అధికారులు ఈవీఎం మరియు వివిప్యాట్ లపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం ఈవీఎం బ్యాలెట్ పత్రాల ముద్రణ పూర్తి అయిన వెంటనే పోలింగ్ కొరకు ఈవీఎం లు, వివిప్యాట్ల ను సిద్ధం (కమీషనింగ్) చేసే బాధ్యత సెక్టర్ అధికారులదేనని అన్నారు. పోలింగ్ రోజు సైతం పోలింగ్ సమయంలో పోలింగ్ కేంద్రాలలో ఈవీఎం, వివిప్యాట్లలో ఏవైనా సమస్యలు తలెత్తినపుడు, వాటిని నిబంధనల ప్రకారం పరిష్కరించే బాధ్యత సెక్టర్ అధికారులది అని అన్నారు. పోలింగ్ రోజు ప్రతి రెండు గంటలకు పోలింగ్ శాతాన్ని రిటర్నింగ్ అధికారికి తెలపాలన్నారు. ఈ శిక్షణా కార్యక్రమంలో ఇంచార్జి డీఆర్వో యన్.జగదీశ్వర్ రెడ్డి, శిక్షణా నోడల్ అధికారి యస్పీ.రాజ్ కుమార్, మాస్టర్ ట్రైనర్లు తరాల పరమేశ్, వి.రమేశ్, కె.గోపాల్ రెడ్డి, సోమయ్య, జానారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *