తన తండ్రి ‘ఎన్టీఆర్’ జీవితకథ ఆధారంగా నందమూరి బాలకృష్ణ ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. తేజ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఇటీవలే క్లాప్ కొట్టుకుంది. బాలకృష్ణతో పాటు ఎవరెవరు కనిపించబోతున్నారన్న సంగతులు ఇంకా బయటకు రాలేదు. అయితే రాజశేఖర్‌కి ఓ పాత్ర ఖాయమైనట్టు సమాచారం. ఇటీవల జరిగిన ‘ఎన్టీఆర్’ చిత్ర ప్రారంభోత్సవానికీ రాజశేఖర్ హాజరయ్యారు. అప్పటినుంచి బాలకృష్ణ, రాజశేఖర్ కలిసి నటించబోతున్నారన్న ప్రచారం ఊపందుకొంది. చంద్రబాబు నాయుడు పాత్రలో రాజశేఖర్ కనిపిస్తారని అనుకుంటున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం రాజశేఖర్ ఈ చిత్రంలో నటిస్తున్నారు. అయితే ఆయనకు ఏ పాత్ర ఇవ్వాలన్న విషయంలో అటు బాలకృష్ణ గానీ, ఇటు తేజ గానీ ఓ అభిప్రాయానికి రాలేదని తెలుస్తోంది. ప్రస్తుతం బాలీవుడ్ నిపుణులతో వివిధ పాత్రలకు సంబంధించిన స్కెచ్చులు రూపొందిస్తున్నారు. ఏ పాత్రకు ఎవరు? అనేది ఆ స్కెచ్చుల పని పూర్తయ్యాకే తెలుస్తుంది. మరోవైపు ‘ఎన్టీఆర్’ చిత్రం రెండు భాగాలుగా రాబోతోందన్న వార్త చక్కర్లు కొడుతోంది. దీనిపైనా చిత్రబృందం ఇంకా ఓ నిర్ణయానికి రాలేదట. కథ విస్తృతి దృష్ట్యా.. రెండు భాగాలుగా తీస్తే బాగుంటుందన్న ఆలోచనలైతే ఉన్నాయి గానీ, ఇంకా వీటిపై స్పష్టత రాలేదని సన్నిహిత వర్గాలు తెలిపాయి.
