ఉన్మాదికి ఉరి…

అక్షిత ప్రతినిధి, హన్మకొండ :  పోలీసు శాఖ అత్యంత చురుగ్గా.. సమర్థంగా వ్యవహరించి అతి తక్కువ కాలంలోనే దర్యాప్తు పూర్తిచేసి బలమైన సాక్ష్యాధారాలతో నిందితుడికి ఉచ్చు బిగించగా.. సత్వరమే విచారణ పూర్తి చేసిన ఉమ్మడి వరంగల్‌ జిల్లా ప్రత్యేక న్యాయస్థానం ఈ  తీర్పు వెలువరించింది. పసిబిడ్డపై దారుణానికి పాల్పడిన పోలెపాక ప్రవీణ్‌ అలియాస్‌ పవన్‌కు ఉరే సరి అని న్యాయమూర్తి కె.జయకుమార్‌ గురువారం సంచలన తీర్పు ఇచ్చారు. తెలుగు రాష్ట్రాల్లో ఇంత స్వల్ప వ్యవధిలో తీర్పు వెలువడిన తొలికేసు ఇదే కావడం విశేషం. హన్మకొండలో పసికందుపై ‘హత్యా’చారం కేసులో తీర్పు వెలువడే సమయంలో న్యాయవాదులు, చిన్నారి తల్లిదండ్రులు, బంధువులతో కోర్టు హాలు కిక్కిరిసిపోయింది. ముద్దాయి ప్రవీణ్‌ను పోలీసులు గురువారం ఉదయం 11 గంటలకు న్యాయస్థానంలో హాజరుపరిచారు. అతడిపై నేరం రుజువైందని న్యాయమూర్తి జయకుమార్‌ ప్రకటించగానే ప్రవీణ్‌ తాను తప్పు చేయలేదని వేడుకుంటూ కన్నీరు పెట్టుకున్నాడు. తర్వాత న్యాయమూర్తి తీర్పు కాసేపు వాయిదా వేయడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. గంట తర్వాత బెంచ్‌ పైకొచ్చిన ఆయన భారత శిక్షాస్మృతి సెక్షన్‌ 302 కింద ముద్దాయిని ఉరి తీయాలంటూ తీర్పు ఇచ్చారు. హైకోర్టు ధ్రువీకరించిన తర్వాత దీనిని అమలు చేయాల్సి ఉంటుందని 52 పేజీల తీర్పులో వెల్లడించారు. మరణదండనతోపాటు ముద్దాయికి అత్యాచారం కింద 20 ఏళ్లు, పోక్సో చట్టంలోని రెండు నేరాల కింద జీవిత ఖైదు విధించడంతోపాటు, అపహరణ కింద అయిదేళ్లు, రూ. 4,000 జరిమానా విధించారు. సంచలనం సృష్టించిన ఈ కేసులో దర్యాప్తు, విచారణ ఇంత త్వరితగతిన పూర్తికావడం తీర్పు వెలువడడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. వరంగల్‌ రూరల్‌ జిల్లా శాయంపేట మండలం వసంతాపూర్‌ గ్రామానికి చెందిన పోలెపాక ప్రవీణ్‌ (25) హన్మకొండలోని కుమార్‌పల్లిలో నివాసం ఉంటూ కూలి పనులు చేస్తుండేవాడు. ఈ ఏడాది జూన్‌ 18న అర్ధరాత్రి మద్యం మత్తులో ఇంటికి చేరుకున్న అతడు ఆ ప్రాంతంలో గేటు తెరిచి ఉన్న ఓ ఇంటిని గమనించాడు. కిటికీలోంచి చూసి లోపల ఎవరూ లేరని గ్రహించాడు. డాబా పైకి వెళ్లగా అక్కడ తొమ్మిది నెలల చిన్నారి తల్లి పొత్తిళ్లలో నిద్రపోతూ ఉండడాన్ని గమనించాడు. వెంటనే పసిపాపను ఎత్తుకొని కిందికి వచ్చి నిర్మానుష్యంగా ఉండడంతో లైంగిక దాడికి పాల్పడ్డాడు. పాప ఏడవడంతో నోరు, ముక్కు మూసి హతమార్చాడు. కొద్దిసేపటికి పక్కలో పాప లేకపోవడాన్ని గమనించిన తల్లి కంగారు పడి కుటుంబసభ్యులకు తెలిపింది. వెంటనే పాప మేనమామతోపాటు అతడి స్నేహితులు వెతుక్కుంటూ బయలుదేరగా భుజం మీద పాప మృతదేహాన్ని తీసుకొని వెళుతున్న ప్రవీణ్‌ కనిపించాడు. అతడిని పట్టుకోబోగా శవాన్ని కిందపడేసి, పరుగు తీయడంతో వారు వెంబడించి పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఈ దారుణం గురించి తెలియగానే స్థానికులు నివ్వెరపోయారు. వరంగల్‌ నగరంతో  పాటు పలు ప్రాంతాల్లో జనం పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి.. సభ్యసమాజం తలదించుకొనే ఇలాంటి దారుణాలు పునరావృతం కాకుండా ఉండాలంటే నిందితుడిని ఉరి తీయాల్సిందేనని నినదించారు. రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థి, మహిళా, ప్రజా సంఘాలు వారంరోజులపాటు ఆందోళనలు నిర్వహించి చిన్నారి తల్లిదండ్రులకు అండగా నిలిచాయి. ఈ కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పోలీసులు చురుగ్గా వ్యవహరించి, 20 రోజుల్లోనే దర్యాప్తు పూర్తి చేశారు. నిందితుడిపై అపహరణ, అత్యాచారం, హత్య తదితర నేరాలతోపాటు లైంగిక నేరాల నుంచి బాలల రక్షణ చట్టం (పోక్సో) కింద కేసులు నమోదు చేశారు. 51 మంది సాక్షుల్లో 30 మందిని విచారించారు. కోర్టులో 20 పేజీల నేరారోపణ పత్రాన్ని దాఖలు చేశారు. సాక్ష్యాధారాలు బలంగా ఉండడంతో న్యాయస్థానం ఉరి శిక్ష విధించింది.

సీసీ టీవీ ఫుటేజీలే ఆధారం
2008లో బీటెక్‌ విద్యార్థినులపై వరంగల్‌ నగరంలో యాసిడ్‌ దాడి ఘటనలో పోలీసు ఎన్‌కౌంటర్లో ముగ్గురు నిందితులు మృతిచెందడం అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించగా.. తాజాగా పసికందుపై అత్యాచారం, హత్యకు పాల్పడిన ముద్దాయికి ఉరిశిక్ష విధించడం మరో సంచలనంగా మారింది. జూన్‌ 18 అర్ధరాత్రి ఘటన జరిగితే, ఆగస్టు 8న తీర్పు వెలువడింది. అంటే కేవలం 48 రోజుల్లో తీర్పు వెలువడడం ఓ రికార్డు. హన్మకొండ పోలీసు సహాయ కమిషనర్‌ శ్రీధర్‌ ఈ కేసుపై ప్రత్యేక దృష్టిసారించారు. పోలీసులు మొదట సంఘటన స్థలంలోని సీసీ టీవీ కెమెరా ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడు చిన్నారిని ఎత్తుకెళ్లిన దృశ్యాలు కెమెరాల్లో స్పష్టంగా కనిపించాయి. నిందితుడిపై 2014లో నమోదైన దొంగతనం కేసును వెలికి తీశారు. అన్నీ కలిపి నేరాభియోగ పత్రాన్ని సిద్ధం చేసి న్యాయస్థానంలో సమర్పించారు. సాక్ష్యాధారాలు బలంగా ఉండేలా కృషిచేశారు. నిందితుడి తరఫున వాదించడానికి న్యాయవాదులెవరూ ముందుకు రాకపోవడంతో, ప్రభుత్వం వరంగల్‌ న్యాయ సేవా అధికార సంస్థ నుంచి సీహెచ్‌.రవీందర్‌రెడ్డి అనే న్యాయవాదిని అతడి కోసం నియమించింది. బాధితుల తరఫున పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ మోకిల సత్యనారాయణగౌడ్‌ వాదించారు. సీనియర్‌ న్యాయవాది జి.రత్నారెడ్డి న్యాయ సహాయకుడిగా వ్యవహరించారు. అటు పోలీసులు దర్యాప్తునువేగంగా పూర్తిచేయగా, ఇటు న్యాయస్థానం కేసును త్వరితగతిన విచారించి తీర్పు వెలువరించడంతో ప్రజలు హర్షంవ్యక్తం చేశారు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *