ఈ-బిజ్‌ ఎండీ, ఆయన కుమారుడు అరెస్ట్‌

అక్షిత ప్రతినిధిహైదరాబాద్‌ : విద్యార్థులే లక్ష్యంగా గొలుసుకట్టు మోసానికి పాల్పడిన  ఈ-బిజ్‌ ఎండీ పవన్‌ మల్హాన్‌, ఆయన కుమారుడు హితిక్‌ మల్హాన్‌లను సైబరాబాద్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. గొలుసుకట్టు విధానం ద్వారా ఈ-బిజ్‌ సంస్థ తమను మోసం చేసిందంటూ కేపీహెచ్‌బీ, మాదాపూర్‌ పోలీస్‌స్టేషన్లలో ఫిర్యాదులు నమోదయ్యాయి. దీనిపై విచారణ చేపట్టిన సైబరాబాద్‌ పోలీసులు.. గొలుకట్టు విధానం ద్వారా దేశవ్యాప్తంగా రూ.5వేలకోట్ల మోసానికి పాల్పడినట్లు గుర్తించారు. దిల్లీలో పవన్‌, హితిక్‌లను అరెస్టు చేసి హైదరాబాద్‌ తీసుకొచ్చారు. అనంతరం నిందితులను చర్లపల్లి జైలుకు తరలించారు.  హరియాణాలోని నోయిడా సెక్టార్‌ 63లో ఈబిజ్‌ సంస్థ ప్రధాన కార్యాలయం 2001లో ప్రారంభమైంది. అదే ప్రాంతానికి చెందిన పవన్‌ మల్హాన్‌ ఎండీగా, అతని భార్య అనిత మల్హాన్‌ డైరెక్టర్‌గా రిజిస్ట్రార్‌ ఆఫ్‌ కంపెనీలో నమోదు చేశారు. వీరి కుమారుడు హితిక్‌ మల్హాన్‌ సంస్థ కార్యకలాపాల్ని పర్యవేక్షించాడు. సంస్థ ప్రమోటర్లు విద్యార్థులు, నిరుద్యోగ యువతను లక్ష్యంగా చేసుకుని అక్రమ వసూళ్లకు పాల్పడ్డారు. తమ సంస్థకు చెందిన ఈ-లెర్నింగ్‌ ప్రాజెక్టుల్లో చేరితే సులభంగా డబ్బు సంపాదించుకోవచ్చని ప్రలోభపెడుతూ సభ్యుల్ని చేర్పించుకున్నారు. నెలలోనే పెట్టుబడి సొమ్ము సంపాదించవచ్చంటూ ఆశ చూపారు. నెల రోజులైనా తమ డబ్బులు తిరిగి రాకపోవడాన్ని గుర్తించి ప్రశ్నించిన వారికి కంపెనీ ప్రతినిధులు చావు కబురు చల్లగా చెప్పారు. ‘‘మరో ముగ్గుర్ని చేర్పిస్తే తప్ప డబ్బు రాదు’’ అంటూ కొత్త సభ్యుల్ని చేర్పించే పరిస్థితిని కల్పించారు. అలా సంస్థ ప్రతినిధులు హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై, దిల్లీ నగరాలతోపాటు జమ్మూకశ్మీర్‌, ఉత్తర్‌ ప్రదేశ్‌, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, గోవా, తెలంగాణ రాష్ట్రాల్లో గొలుసుకట్టు మోసాన్ని కొనసాగించినట్లు పోలీసులు గుర్తించారు.

జగిత్యాల విద్యార్థి ఫిర్యాదుతో గుట్టురట్టు

జగిత్యాల జిల్లా కేంద్రంలోని మహాలక్ష్మినగర్‌కు చెందిన సామల్ల వివేక్‌ హైదరాబాద్‌ కుందన్‌భాగ్‌లో ఉంటూ డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఓ ప్రమోటర్‌ అతన్ని ఏమార్చి ఈ-బిజ్‌ సంస్థలో చేర్పించాడు. రెండు నెలలైనా తన పెట్టుబడి తిరిగి రాకపోవడంతో కంగుతిన్న వివేక్‌..తనను చేర్పించిన వ్యక్తిని నిలదీశాడు. మరికొంత మందిని చేర్పిస్తేనే కమీషన్‌ వస్తుందని సదరు ప్రమోటర్‌ స్పష్టం చేయడంతో ఇది గొలుసుకట్టు మోసమని గుర్తించిన అతను సైబరాబాద్‌ ఆర్థిక నేరాల విభాగం పోలీసుల్ని ఆశ్రయించాడు.

 

 

tags : ebiz, cyber crime

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *