ఇదేమి… నేర పరిశోధన !!

న్యాయవాద దంపతుల హత్య

అపరాధ పరిశోధన 

బిట్టు’ , మధుకర్ ను తప్పించేందుకేనా?

గుంజపడుగు … పోలీసులనడుగు…

నడిరోడ్డుపై హత్య చేసిన న్యాయవాద దంపతుల కేసు ఇరు పక్షాల వివాదంగా ముడిపెట్టి పక్కదారి పట్టించే పనిలో మునిగి తేలుతుండ్రు. ఎన్నో అంశాల్లో పేదల పక్షాన… చట్టబద్ద న్యాయమందించెందుకు నిలిచి పోరాడిన న్యాయ దంపతులను అంతమొందించిన సూత్ర దారులను తప్పించే కుట్ర కోణం వెలుగు చూస్తుంది. ఇది ముమ్మాటికి రాజకీయ హత్య? ఇప్పటికే కేసును సుమోటోగా హైకోర్టు స్వీకరించినప్పటికి పోలీసులు ఎలా నిగ్గు తేల్చుతారో తెలంగాణ యావత్తు దృష్టి కళ్ళప్పగించి చూస్తుంది.

మంథని, అక్షిత ప్రతినిధి :

గుడి వివాదం, ఇంటి నిర్మాణం సందర్భంగా తలెత్తిన విభేదాలు,రామాలయం కమిటీ సమస్యలు వెరసి న్యాయవాది వామన్ రావుపై కుంటా శ్రీనివాస్ కక్ష పెంచుకున్నాడు. ఐదారేళ్లుగా ఇద్దరి మధ్య గొడవలు ఉన్నవి. కనుక కుంటా శ్రీనివాస్ కోపంతో న్యాయవాద దంపతులను కత్తులతో పొడిచి చంపాడు. హత్యాకాండ జరిగిన స్థలంలో సాక్ష్యాధారాలు చేదిరిపోకుండా ఇద్దరు కానిస్టేబుళ్లను కూడా పెట్టారు. ఈ హత్యలకు రాజకీయ కారణాలు లేవు.దోషులు ఎంతటి వారినైనా పోలీసులువిడిచిపెట్టరు. TRS మాజీ ఎమ్మెల్యే, పెద్దపల్లి ZP చైర్మన్ పుట్ట మధు మేనల్లుడు బిట్టు శ్రీను,నిందితులకు కార్లు,కొడవళ్ళు సరఫరా చేసినా అతన్ని నిందితునిగా నమోదు చేయడంలో జాప్యం ఏమిటి? నిందితులకు ఆయుధాలు, ఇతర లాజస్టిక్స్ సరఫరా చేసినవారు   ‘ఇంకా దొరకలేదు’.గాలింపు చర్యలు సాగుతున్నవి.
నేర పరిశోధనలో పోలీసులు రాజీపడరు. దర్యాప్తు నిష్పక్షపాతంగా జరుగుతుంది.పోలీసులు నిజాలు మాట్లాడుతారు. ప్రభుత్వం అసలు జోక్యం చేసుకోదు. అధికార పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు మంచివారు. కడిగిన ముత్యాలు,వజ్రాలు. హత్యలు చేసిన వారు మహారాష్ట్ర సరిహద్దుల్లో తనిఖీల్లో పట్టుబడ్డారు(ట). పోలీసులు అత్యంత అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎందుకు వాడుకోలేదు. వాంకిడి దగ్గర మహారాష్ట్ర బార్డర్ వరకు నిందితులు ఎట్లా తప్పించుకొని పోగలిగారు. దోషులను పట్టుకునేందుకు ఎందుకు వేగంగా స్పందించలేదు.యుద్ధప్రాతిపదికన ఎందుకు ‘ట్రాక్’ చేయలేదు.సంఘటన స్థలంలో ఐదుగురు వ్యక్తులు ఉన్నట్టు బుధవారం రాత్రి రామగుండం పోలీసులు తెలిపారు. గురువారం సాయంత్రం ఆ సంఖ్య మూడుకు తగ్గింది. అసలు నడిరోడ్డు పైన నిత్యం రద్దీగా ఉండే చోట పట్టపగలు ఇద్దరిని హత్య చేసిన వ్యక్తులు పోలీసుల కన్ను గప్పి మహారాష్ట్ర వరకు ఉడాయించే పరిస్థితి ఉందా? ఎవరో ఒకరు, లేదా కొందరు డైరెక్షన్ ఇవ్వకుండా ఇది సాధ్యమా? గురువారం రాత్రి పోలీసు ఇన్స్పెక్టర్ జనరల్ నాగిరెడ్డి మీడియా సమావేశం ఎందుకు క్లుప్తంగా ముగించారు? హత్య కుట్ర ప్రకారం జరగలేదని చెప్పడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నట్టు అనుమానం ఉన్నది.వ్యక్తి గత కక్షలతోనే హత్యలు జరిగినట్టు నిర్ధారణకు వస్తున్నారా? ‘ప్రొఫెషనల్ కిల్లర్ ల పని’లా ఉన్నట్టు రామగుండం కమిషనర్ సత్యనారాయణ ముందుగా చెప్పారు. ఇప్పుడేమో కుంటా శ్రీనివాస్,అతని అనుచరులు కత్తులతో పొడిచి చంపారని అంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *