ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్యే

నిరుద్యోగుల ఆకలి కేకలు
ఇకనైనా కండ్లు తెరువాలి
ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగిన మంద
నాగార్జున సాగర్, అక్షిత ప్రతినిధి :
ఆర్థిక ఇబ్బందులు తాళలేక ప్రైవేట్ టీచర్ ఆత్మహత్య… ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్యగానే పరిగణించాలని మహా జన సోషలిస్ట్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ మండిపడ్డారు. ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయకపోవడం… ప్రైవేట్ బడులకు తాళం వేయడంతో ఆర్థిక సమస్యలతో నిరుద్యోగులు తల్లడిల్లుతున్నారని ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగారు. బుధవారం
ఎం ఎస్ పి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు తీగల ప్రదీప్ గౌడ్, ఎం ఆర్ పి ఎస్ సీనియర్ నేత గోడ పర్తి జానకి రామయ్య చౌదరితో కలిసి
నాగార్జునసాగర్ హిల్ కాలనీలో ఆత్మహత్య చేసుకున్న ప్రైవేట్ టీచర్ రవికుమార్ మృత దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంద కృష్ణ మాదిగ మాట్లాడుతూ… ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యగానే పరిగణించాలి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో నియామకాలు లేక నిరుద్యోగులు ఏమి చేయాలో అర్థంకానీ పరిస్థితిలో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. పొరుగు రాష్ట్రం నిరుద్యోగులపై ప్రత్యేక దృష్టి పెట్టి ఉపాధి అవకాశాలు కల్పిస్తూ.. నిరుద్యోగ సమస్య తగ్గిస్తే.. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వానికి ఆ ఆలోచన లేకుండా పోయిందని ధ్వజమెత్తారు.ఇకనైనా ప్రభుత్వం విద్యార్థుల పట్ల కండ్లు తెరవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. తక్షణమే ఆ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని,ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పిస్తూ.. ఆ కుటుంబ సభ్యులకు ప్రభుత్వ వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. నీళ్ళు, నిధులు, నియామకాల ట్యాగ్ లైన్ తో పురుడు పోసుకున్న తెలంగాణ… సీఎం కేసీఆర్ మాత్రం ఆదిశలో పనిచేయడం లేదని దుయ్యబట్టారు. అరేండ్ల కేసీఆర్ పాలనలో ప్రభుత్వ నోటిఫికేషన్లు విడుదల చేయకపోవడంతోనే నిరుద్యోగుల జీవితాల పాలిట శాపంగా పరిణమించిందని ఆయన ఆరోపించారు. ఇకనైనా ప్రభుత్వం దృష్టి సారించి ఉద్యోగాల కల్పనకు చొరవ చూపాలన్నారు. యువత, నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడవద్దని …ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *