ఇంటింటా జ్వర సర్వే

 

★ 11,600 ప్రత్యేక బృందాల ఏర్పాటు

★ కరోనా రక్కసిపై రాష్ట్ర ప్రభుత్వం యుద్ధం

★ రోజూ 2.5 లక్షల మందికి పరీక్షలు

★ పాజిటివ్‌ వస్తే వెంటనే మెడికల్‌ కిట్‌

★ అందుబాటులో 10 లక్షల హెల్త్‌ కిట్లు

★ అవసరమైతే దవాఖానకు తరలింపు

★ 16 ట్యాంకర్లతో ఆక్సిజన్‌ సరఫరా

★ హెల్ప్‌లైన్‌ ద్వారా ఆరోగ్య సలహాలు

★ గ్రేటర్‌లో ఒక్కరోజే 40వేల ఇండ్లలో సర్వే

★ 68,000రెమ్‌డెసివిర్‌ ఇంజెక్షన్లు సిద్ధం

★ 10 రోజులకు సరిపడా ఆక్సిజన్‌ నిల్వ

హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :

రోనా మహమ్మారిపై రాష్ట్రప్రభుత్వం భీకర యుద్ధం ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటికీ తిరిగి ఆరోగ్య పరీక్షలు నిర్వహించే బృహత్‌ కార్యక్రమానికి నడుంకట్టింది. కరోనా అనుమానం ఉన్న ప్రతి ఒక్కరికీ పరీక్షలు నిర్వహించి, అవసరమైనవారిని మెరుగైన చికిత్సకోసం దవాఖానలకు తరలించేందుకు ప్రత్యేక కార్యాచరణను రూపొందించి అమలు చేస్తున్నది. ఇందుకోసం 11,600 బృందాలను ఏర్పాటుచేసింది. ఈ బృందాల సభ్యులు గ్రామాలు, పట్టణాలవారీగా ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజల ఆరోగ్య పరిస్థితిని వాకబుచేస్తారు. కరోనా లక్షణాలున్నవారిని గుర్తించి వారి ఆరోగ్య పరిస్థితిని అంచనా వేస్తారు. హోం ఐసొలేషన్‌ అవసరమైనవారికి వెంటనే హెల్త్‌ కిట్లు అందజేస్తారు. వైరల్‌ లోడ్‌ ఎక్కువ ఉన్నట్టు గమనిస్తే వారిని దగ్గరలోని ఆరోగ్య కేంద్రానికి, దవాఖానకు తరలించి చికిత్స అందిస్తారు. ప్రతి బృందంలో ఒక ఏఎన్‌ఎం, ఆశ వర్కర్‌, పంచాయతీ లేదా మున్సిపల్‌ సిబ్బంది ఉంటారు. అవసరమైతే అంగన్‌వాడీ, గ్రామాల్లో ఉండే స్వచ్ఛంద సంస్థల సభ్యులను కూడా బృందంలో భాగస్వాములను చేసుకొంటారు.

రోజూ వందమందికి..
——————————————————–
ఒక్కో బృందం రోజూ 50-100 మందిని పరీక్షించేలా కార్యాచరణ రూపొందించారు. ఇంటింటికీ తిరిగి సేకరించిన వివరాలతో ప్రతి గ్రామానికి సంబంధించి నివేదికను రూపొందిస్తారు. కరోనా ప్రాథమిక పరీక్షలు అక్కడికక్కడే చేస్తారు. ఎవరికైనా ఇతర సమస్యలుంటే వాటికి సంబంధించి కూడా సంబంధిత వైద్య సిబ్బంది సలహాలు ఇస్తారు. అన్ని బృందాలు కలిసి రోజూ రాష్ట్రవ్యాప్తంగా రెండున్నర నుంచి మూడు లక్షల మందికి పరీక్షలు నిర్వహించాలని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ లక్ష్యంగా నిర్దేశించింది. ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తూనే కరోనాపై అవగాహన కల్పిస్తారు.

ఫోన్‌ చేస్తే సాయం
——————————————————–
ప్రతి జిల్లాలో కరోనా హెల్ప్‌లైన్‌ను ప్రభుత్వం ప్రారంభించింది. ఇంటింటి సర్వే సందర్భంగా ప్రజలందరికీ హెల్ప్‌లైన్‌ నంబర్‌ ఇస్తారు. హైదరాబాద్‌లో 040-2111 1111 నంబర్‌ను ఇచ్చారు. ఈ నంబర్‌కు ఇప్పటి వరకు 1964 కాల్స్‌ వచ్చాయి. అత్యవసర వైద్యంకోసం ఎక్కువగా ఫోన్లు వస్తున్నట్టు అధికారులు చెప్తున్నారు. కరోనా పాజిటివ్‌ ఉన్నవారికి ఆరోగ్య కార్యకర్తలు, ఆశ వర్కర్ల ద్వారా హెల్త్‌కిట్లు పంపిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పది లక్షల హెల్త్‌ కిట్లను అందుబాటులో ఉంచారు. మండల కేంద్రాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో, జిల్లా దవాఖానలో కరోనా రోగులకు చికిత్స అందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. మున్సిపాలిటీల్లో ఐసొలేషన్‌ కేంద్రాలను అందుబాటులోకి తెచ్చారు. కలెక్టర్లకు పూర్తి స్వేచ్ఛనివ్వడంతో వారు స్థానిక పరిస్థితులకు అనుగుణంగా వైద్య సిబ్బందిని నియమించి పనులు చేయిస్తున్నారు.

అన్ని జిల్లాల్లో రెమ్‌డెసివిర్‌
——————————————————–
రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో రెమ్‌డెసివిర్‌ ఇంజెక్షన్లు అందుబాటులో ఉంచారు. ప్రతీ జిల్లా కేంద్ర దవాఖానలో ఆక్సిజన్‌ అందుబాటులో ఉంచడంతోపాటు సరఫరాకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటుచేశారు. ఈ బృందాలు రోజువారీగా ఏ దవాఖానలో ఎంత ఆక్సిజన్‌ అవసరం? ఎక్కడి నుంచి ఆక్సిజన్‌ పంపించాలన్నదానిపై ప్రణాళికలు రూపొందించుకున్నాయి. రెమ్‌డెసివిర్‌ ఇంజెక్షన్లకు కొరత లేకుండా చూస్తున్నారు. కలెక్టర్లు, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారుల ఆధ్వర్యంలో కమిటీ వేసి అత్యవసర, ప్రాణాధార మందులను అందిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం వరకు 68 వేల రెమ్‌డెసివిర్‌ ఇంజెక్షన్లు అందుబాటులో ఉంచారు. మరో లక్ష ఇంజెక్షన్లు సమీకరిస్తున్నారు. వీటికోసం రాష్ట్రప్రభుత్వం నేరుగా 9 ఫార్మా కంపెనీలతో చర్చలు జరుపుతున్నది. గత నెలలోనే రెమ్‌డెసివిర్‌ కోసం ప్రభుత్వం ఆర్డర్లు ఇచ్చింది. ఆ తర్వాత కేంద్రప్రభుత్వం వీటిని నేరుగా రాష్ర్టాలకు ఇవ్వవద్దని, కోటా ప్రకారం ఇవ్వాలని కంపెనీలకు సూచించింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో చర్చలు జరుపుతున్నది. ఇతర రాష్ర్టాలకు చెందిన రోగులు కూడా పెద్ద ఎత్తున మన రాష్ర్టానికి కరోనా చికిత్స కోసం వస్తుండటంతో వీటి వినియోగం పెరిగింది.

గ్రేటర్‌లో ఒక్కరోజే 40వేల ఇండ్లలో సర్వే
————————————————————-
కొవిడ్‌ నియంత్రణలో భాగంగా ప్రభుత్వ ఆదేశాలమేరకు గ్రేటర్‌ హైదరాబాద్‌లో జీహెచ్‌ఎంసీ, వైద్యారోగ్య శాఖలకు చెందిన 641 బృందాలు ఇంటింటి సర్వే చేపట్టాయి. జ్వరం, కొవిడ్‌ లక్షణాలున్న వారి వివరాలను సేకరిస్తున్నాయి. ఒక్కో బృందంలో ఒక ఏఎన్‌ఎం, ఆశ వర్కర్‌, జీహెచ్‌ఎంసీ ఎంటమాలజీ వర్కర్‌ ఉన్నారు. మంగళవారం ఒక్కరోజే 40 వేల ఇండ్లలో సర్వేను నిర్వహించారు. 1,487 మంది జర్వంతో ఉన్నట్టు గుర్తించారు. వీరిలో 1,400 మందికి కొవిడ్‌ మందుల కిట్‌ అందజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *