ఇంటర్నెట్‌ బంద్‌తో గంటకు రూ.2 కోట్లు కోల్పోతున్న సంస్థలు

అక్షిత నెట్వర్క్, దిల్లీ: అల్లర్లు, ఆందోళనల సమయంలో ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేస్తుంటారు. వదంతులు వ్యాపించకుండా, అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అధికారులు ఇలాంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటారు. అయితే దీని వల్ల టెలికాం సంస్థలు ఆదాయ పరంగా కోట్ల రూపాయల మేర నష్టపోతున్నాయి. ఆందోళనల సమయంలో ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేయడంతో మొబైల్‌ ఆపరేటర్లు ప్రతి గంటకు దాదాపు రూ. 2.45కోట్ల ఆదాయాన్ని కోల్పోతున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. 

మొన్నామధ్య ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత జమ్ముకశ్మీర్‌లో రోజుల తరబడి కమ్యూనికేషన్ వ్యవస్థను, ఇంటర్నెట్‌ను నిలిపివేసిన విషయం తెలిసిందే. తాజాగా పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో దేశ రాజధాని దిల్లీ సహా యూపీ, అసోం లాంటి రాష్ట్రాల్లో మొబైల్‌ సేవలపై ఆంక్షలు తీసుకొచ్చారు. ఇప్పటికీ యూపీలోని చాలా జిల్లాల్లో ఇంటర్నెట్‌ బంద్‌ కొనసాగుతోంది. దిల్లీలోని కొన్ని గంటల పాటు మొబైల్, ఇంటర్నెట్‌ సేవలను పాక్షికంగా నిలిపివేశారు.

అయితే అధికారుల ఆదేశాలతో సేవలను నిలిపివేయడంతో తాము చాలా ఆదాయాన్ని కోల్పోతున్నట్లు టెలికాం ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ‘2019 గణాంకాలను పరిశీలించినట్లయితే ఇంటర్నెట్‌ నిలిపివేత కారణంగా కంపెనీలు ప్రతి గంటకు రూ.2.45కోట్ల చొప్పున ఆదాయాన్ని నష్టపోతున్నాయి’ అని సెల్యులార్‌ ఆపరేటర్స్‌ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(సీఓఏఐ) డైరెక్టర్‌ జనరల్‌ రాజన్‌ మాథ్యూస్‌ ఓ అంతర్జాతీయ మీడియాకు తెలిపారు. ఇప్పటికే రుణ ఊబిలో చిక్కుకుపోయిన టెలికాం సంస్థలకు ఇది మరింత ఆందోళన కలిగిస్తోందని అన్నారు. అయితే ఈ నష్టాలపై ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియా, రిలయన్స్‌ జియో ఎలాంటి అధికారిక ప్రకటనలు చేయలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *