ఇంకా పథకాలున్నాయ్.. అవి తీసుకొచ్చానో.. కేసీఆర్

అక్షిత ప్రతినిధి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ వేదికగా జాతీయ పార్టీలు అయిన కాంగ్రెస్, బీజేపీపై గులాబీ బాస్, సీఎం కేసీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆదివారం నాడు అసెంబ్లీలో మాట్లాడిన కేసీఆర్.. దుర్మార్గాలకు బ్రీడింగ్‌ సెంటర్‌ కాంగ్రెస్సే అని సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ వచ్చినా కాంగ్రెస్‌ నేతలు కుట్రలు ఆపడం లేదని.. ప్రాజెక్టులు, ఉద్యోగాల నోటిఫికేషన్లపై కేసులు వేశారని సీఎం మండిపడ్డారు. తెలంగాణ ఇచ్చి తప్పు చేశామని కాంగ్రెస్ మాట్లాడుతుండటం సిగ్గుచేట్టన్నారు.

రెండు, మూడు పథకాలు తెచ్చానో!

అంతటితో ఆగని కేసీఆర్.. ‘ఇప్పటివరకూ ప్రవేశపెట్టిన పథకాలే కాకుండా ఇంకో రెండు, మూడు పథకాలు ఉన్నాయి. అవి తీసుకొస్తే రాష్ట్రంలో కాంగ్రెస్‌ ఉండదిక. మరో మూడు టర్మ్‌లో టీఆర్‌ఎస్‌దే అధికారం’ అని కేసీఆర్‌ చెప్పుకొచ్చారు. ఆయుష్మాన్‌ కంటే ఆరోగ్య శ్రీ పథకం చాలా ప్రయోజనకరమని.. ఉద్యోగాల డిమాండ్ తప్పు అనడం లేదన్నారు. అయితే ఇంటికో ఉద్యోగం అనడం సరికాదని.. యువతను అనవసరంగా రెచ్చగొట్టొద్దని కాంగ్రెస్ నేతలు కేసీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

మోదీ మాటలు మానుకోవాలి!

‘బీజేపీ ప్రభుత్వంలో హామీలే తప్ప నిధులు రావడం లేదు. కాళేశ్వర ప్రాజెక్టుకు జాతీయహోదా ఇవ్వాలని కోరితే పట్టించుకోలేదు. బీజేపీ ఏమీ ఇవ్వకపోగా తెలంగాణ రాష్ట్రాన్ని అవమానిస్తోంది. తల్లిని చంపి బిడ్డను బతికించారన్న మాటలు మోదీ మానుకోవాలి. తెలంగాణ ఏర్పాటు డార్క్‌ డే అని అమిత్ షా అన్నారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కించపర్చడం సరికాదు. 60 ఏళ్లు పోరాటం చేసి తెలంగాణ తెచ్చుకున్నాం. రాష్ట్రాన్ని ఎవరూ దానంగా ఇవ్వలేదు. సరిహద్దు మహారాష్ట్ర ప్రజలు తెలంగాణలో కలుస్తామంటున్నారు బీజేపీ ప్రభుత్వం కంటే టీఆర్‌ఎస్‌ పాలన గొప్పగా ఉంది. కిసాన్‌ సమ్మాన్‌ కంటే రైతుబంధు ఎన్నో రెట్లు ఉపయోగం ఉంది’ అని కేసీఆర్ చెప్పుకొచ్చారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *