ఆ ఫొటోలు సిరియాలోనివేనా..?

అమెరికా అధ్యక్షుడు ఎవరో సోషల్‌ మీడియానే నిర్ణయించింది. ట్రంప్‌కు మద్దతుగా వెల్లువెత్తిన పోస్టుల ప్రభావం ఎన్నికలపై పడిందని హిల్లరీ వర్గం గగ్గోలు పెట్టింది. ఈ ఒక్క ఘటన చాలు సోషల్‌ మీడియా శక్తిని తెలియజేయడానికి. తాజాగా సోషల్‌ మీడియాలో కృత్రిమ మేధతో పనిచేసే రోబోలను వినియోగించి మరీ పోస్టులను వ్యాప్తి చేస్తున్నారు. తాజాగా  సోషల్‌ మీడియాలో సిరియా యుద్ధబీభత్సంపై  కథనాలు, చిత్రాలు, వీడియోలు వెల్లువెత్తుతున్నాయి. వీటిల్లో చాలా తక్కువ మాత్రమే ప్రస్తుత సిరియా యుద్ధానికి సంబంధించినవి. మిగిలినవి  ప్రపంచంలో వేర్వేరు ప్రదేశాల్లో జరిగిన దాడులకు సంబంధించినవి. వీటన్నిటినీ సిరియా అంతర్యుద్ధానికి సంబంధించిన వాటిగా చూపుతూ సోషల్‌ మీడియాలో ప్రచారం చేస్తున్నారు.  సోషల్‌ మీడియాలో దొంగ ఖాతాలతో సిరియా యుద్ధంపై తప్పుడు ప్రచారం నిర్వహిస్తున్న 56 మందిని జనవరి చివరి వారంలో టర్కీ భద్రతా దళాలు అరెస్టు చేశాయి. దీంతో ఈ వ్యవహారం బయటకొచ్చింది. తాజాగా డమాస్కస్‌ శివార్లలోని ఘౌటాలో సిరియా భద్రతా దళాలు నిర్వహించిన వైమానిక దాడుల్లో 541 మంది మృతి చెందారు. ఈ ఘటన తర్వాత మరోమారు సోషల్‌ మీడియాలో సిరియా ఫొటోలు వెల్లువెత్తాయి. వీటిల్లో గాజాలో జరిగిన వైమానిక దాడుల ఫొటోలను కూడా సిరియాలో జరిగిన దాడులుగా చూపుతూ ప్రచారం చేస్తున్నారు. ఇక దీనిలోనే ఉన్న మరో చిత్రం ఇరాక్‌లోని మౌసిల్‌ నగరంలో ఐసిస్‌తో యుద్ధం సందర్భంగా తీసినది. ఇప్పుడు సిరియాలో అధ్యక్షుడు బషర్‌ అల్‌అసద్‌కు వ్యతిరేకంగా సోషల్‌ మీడియాలో ప్రచారం ఊపందుకుంది. దాని ఫలితమే తాజాగా వెల్లువెత్తుతున్న ఫొటోలు. వీటిల్లో కొన్న వాస్తవ చిత్రాలు ఉన్నా చాలా భాగం పాతవి, ప్రపంచంలో వివిధ ప్రాంతాల్లోనివి కావడం గమనార్హం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *