ఆ త‌ప్పిదమే కొంప ముంచింది!

రాష్ట్రంలో ఉమ్మ‌డి క‌రీంన‌గ‌ర్ లోనే ఎక్కువ‌…
ఉద్యమాల ఖిల్లా ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా ఎందులోనైనా ఓ ప్రత్యేకతను చాటుకుంటోంది. చివరకు ఎన్నికల్లోనూ తమ తప్పిదాల్లో నెంబర్‌ వన్‌గా నిలిచింది. 2013, 2014లలో జరిగిన రూరల్, అర్బన్‌ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసిన వారు ఇప్పటివరకు ఎన్నికల జమ, ఖర్చుల లెక్కలు చెప్పని వారు 10,379 మంది ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో ఉన్నారు. అందులో ప్రస్తుతం ప్రజాప్రతినిధులుగా కొనసాగుతున్న ఆరుగురు సర్పంచ్‌లతో పాటు 949 మంది వార్డు సభ్యులు ఉన్నారు. ఎన్నికల నిబంధనల ప్రకారం గెలుపోటములతో సంబంధం లేకుండా పోటీ చేసిన అభ్యర్థులంతా ఫలితాలు వెలువడిన 40 రోజుల్లో ఎన్నికల ఖర్చుల వివరాలు ఎన్నికల సంఘానికి అందజేయాలి.

ఈ విషయంలో రాష్ట్ర ఎన్నికల సంఘం గతంలో చూసిచూడనట్లు వ్యవహరించినా ఈసారి మాత్రం చాలా కఠినంగానే వ్యవహరిస్తోంది. అందులో భాగంగానే గత స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసి జమ, ఖర్చుల వివరాలు సమర్పించని వారిపై అనర్హత వేటు వేయాలని నిర్ణయించింది. స్థానిక సంస్థలకు చెందిన వార్డు సభ్యులు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్‌ అభ్యర్థులు అందులో ఉన్నారు. ఎన్నికల్లో పోటీ చేసిన వారందరికి ఖర్చుల లెక్కలు సమర్పించాలని అధికారులు నోటీసులు జారీ చేసినా స్పందించకపోవడంతో వారిపై కఠిన చర్యలు చేపట్టారు.

వ‌చ్చే ఎన్నిక‌ల వ‌ర‌కు అన‌ర్హులేనా?
ఎన్నికల ఖర్చుల వివరాలు చెప్పని వారిపై మూడేళ్ల వరకు 2020 నవంబర్‌ వరకు ఎలాంటి ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు వేసింది. అందులో ప్రస్తుతం ప్రజాప్రతినిధులుగా కొనసాగుతున్న వారు 955 మంది ఉన్నారు. సర్పంచ్, వార్డు మెంబర్ల అభ్యర్థులతో పాటు 57 జెడ్పీటీసీ స్థానాల నుంచి పోటీ చేసిన 45 మంది, 817 ఎంపీటీసీ స్థానాలకు పోటీ చేసిన 371 మందిపైనా అనర్హత వేటు పటింది. అదే విధంగా ఉమ్మడి జిల్లాలోని రెండు కార్పొరేషన్లు సహా మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు నుంచి పోటీ చేసి లెక్కలు చూపని 815 మంది అభ్యర్థులకు నోటీసులు జారీ అయ్యాయి. ఇందులో అత్యధికంగా రామగుండం కార్పొరేషన్‌లో 363 మంది ఉండగా, కరీంనగర్‌లో 132 కాగా, హుజూరాబాద్‌ నగర పంచాయతీలో ఒక్కరే ఉన్నారు. అనర్హత వేటు మిగతా అభ్యర్థులు జగిత్యాల, కోరుట్ల, పెద్దపల్లి, సిరిసిల్ల, వేములవాడ, జమ్మికుంటల నుంచి ఉన్నారు. అనర్హత వేటు పడిన వారిలో ఆందోళన వ్యక్తమవుతుండగా, సర్పంచ్‌ అభ్యర్థి రూ.40 వేలు, వార్డు మెంబర్‌ అభ్యర్థి రూ.6 వేల వరకు.. ఇలా అందరికీ వ్యయాన్ని చూచించినా ఎన్నికల సంఘం.. ఆ లెక్కలు చూపని అభ్యర్థులపై చర్యలకు దిగడం చర్చనీయాంశంగా మారింది.

Tags:
Telangana Panchayat Elections 2019
Candidates
Rejected
karimnagar

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *