ఆస్తి కోసం తల్లిని హతమార్చిన కూతుళ్లు

ఆస్తి కోసం తల్లిని హతమార్చిన కూతుళ్లు

కిరాయి హంతకుడితో పాటు నిందితుల అరెస్టు

అక్షిత ప్రతినిధి, నల్గొండ: ఆస్తుల కోసం తల్లిదండ్రులను హత్యచేసిన కొడుకులు సమాజంలో అక్కడక్కడ కన్పిస్తుంటారు. కానీ అదేస్థాయిల్లో కూతుళ్లు కూడా ఉండటం విచారకరం.. కారణం ఏదైనా ఇద్దరు అక్కాచెల్లెళ్లు మరో వ్యక్తితో కలిసి కన్నతల్లిని హతమార్చిన ఘటన నల్గొండ జిల్లాలో వెలుగుచూసింది. నల్గొండ డీఎస్పీ జి.వెంకటేశ్వర్‌రెడ్డి ఆదివారం రూరల్‌ పోలీస్‌స్టేషన్‌లో వెల్లడించిన వివరాల ప్రకారం.. నల్గొండ మండల పరిధిలోని అప్పాజిపేటకు చెందిన కల్లూరి సత్తమ్మ(60)కి ముగ్గురు కూతుళ్లు, ముగ్గురు కుమారులున్నారు. అందరూ వివాహితులై వివిధ ప్రాంతాల్లో స్థిరపడ్డారు. సత్తమ్మ అదేగ్రామానికి చెందిన కూరాల యాదయ్యతో పదేళ్ల నుంచి కలిసి ఉంటుంది. ఆమె చిన్నకూతురు రుద్రమ్మను కూడా యాదయ్యతో కలిసి ఉండాలని చెప్పడంతో పాటు ఇద్దరికి వివాహం చేసింది. వీరికి ఒకపాప పుట్టిన తర్వాత గొడవలు రావడంతో రుద్రమ్మ చౌటుప్పల్‌కు వెళ్లి కిరాణ దుకాణం నిర్వహిస్తూ అక్కడే ఒంటరిగా ఉంటోంది. ఇటీవల డబ్బులు అవసరం ఉండటంతో రుద్రమ్మ తల్లిని అడుగగా.. ఇవ్వడం కుదరదని కొడుకులకు మాత్రమే ఇస్తానని చెప్పడంతో రుద్రమ్మ తల్లిపై కోపం పెంచుకుంది. చౌటుప్పల్‌ మండలం రెడ్డిబాయిలో ఉంటున్న పెద్ద సోదరి మాదగోని ఆండాళుకు ఈ సమాచారం ఇవ్వడంతో పాటు తల్లిని ఎలాగైనా హత్యచేయాలని నిర్ణయించుకున్నారు. అక్టోబర్‌ 31న రుద్రమ్మ చండూరు మండలం నెర్మటకు చెందిన గుయ్యాని జంగయ్యకు రూ.20వేలు సుఫారి ఇస్తానని తల్లిని హత్యచేయడానికి సహకరించాలని కోరింది. అదేరోజు రాత్రి ఇద్దరు కలిసి మోటార్‌ సైకిల్‌పై అప్పాజిపేటలోని తల్లి వద్దకు వచ్చారు. జంగయ్య సత్తమ్మను పట్టుకోగా రుద్రమ్మ గొంతు నులిమి హత్యచేశారు. అనంతరం ఇంట్లోని మూడు తులాల బంగారు ఆభరణాలు, రూ.30వేల నగదుతో పాటు 50 తులాల వెండి వస్తువులు తీసుకెళ్లారు. తల్లిని హత్యచేసినట్లు రుద్రమ్మ ఆండాళుకు చరవాణి ద్వారా సమాచారం అందించింది. మృతురాలి కుమారుడు కల్లూరి సైదులు అనుమానంతో పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో రుద్రమ్మ ఫోన్‌కాల్‌ డేటా ఆధారంగా ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ చెప్పారు. వారి నుంచి రూ.30వేల నగదు, వెండి వస్తువులు, మోటార్‌సైకిల్‌, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *