ఆసుపత్రి నుంచి అమితాబ్ బచ్చన్ డిశ్చార్జ్

అక్షిత ప్రతినిధి, ముంబై : బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్ ఆరోగ్యం మెరుగుపడింది. దీంతో శుక్రవారం రాత్రి 9.45 గంటలకు అమితాబ్ బచ్చన్‌ను నానావతి ఆసుపత్రి వైద్యులు డిశ్చార్జి చేశారు. నాలుగురోజుల క్రితం అమితాబ్ బచ్చన్ ముంబై నగరంలోని నానావతి ఆసుపత్రిలో చేరారు. అమితాబ్ కాలేయ సంబంధ సమస్యతో మంగళవారం తెల్లవారుజామున 3 గంటలకు ఆసుపత్రిలో చేరారని నానావతి ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.అమితాబ్‌ను అతని కుమారుడు అభిషేక్ బచ్చన్, భార్య జయాబచ్చన్‌లు తన తెల్లరంగు రేంజ్ రోవర్ కారులో వచ్చి ఆసుపత్రి నుంచి ఇంటికి తీసుకువెళ్లారు. అమితాబ్ సాధారణ వైద్యపరీక్షల కోసం ఆసుపత్రికి వచ్చారని, ఆయన బాగానే ఉన్నారని నానావతి ఆసుపత్రి వర్గాలు చెప్పాయి. కాని నానావతి ఆసుపత్రి వైద్యులు మాత్రం అమితాబ్ ఆరోగ్యంపై ఎలాంటి బులిటిన్ విడుదల చేయలేదు. బిగ్ బి హోస్ట్ చేస్తున్న ప్రముఖ క్విజ్ షో ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ షూటింగ్ మంగళవారం నుంచి ప్రారంభమవుతుందని టీవీ వర్గాలు వెల్లడించాయి. తన కాలేయం 75 శాతం దెబ్బతిందని ఇటీవల అమితాబ్ బచ్చన్ ఓ కార్యక్రమంలో వెల్లడించారు. తాను టీబీ, హెపటైటిస్ బి వ్యాధుల నుంచి కోలుకున్నానని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *