ఆర్టీసీ సమ్మె… వెనక్కు తగ్గని ప్రభుత్వం

అక్షిత ప్రతినిధి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల సమస్యలపై చొరవ చూపాలని హైకోర్టు సూచించినా ప్రభుత్వం మాత్రం వెనక్కు తగ్గలేదు. కార్మిక సంఘాలను ఎలాంటి చర్చలకు ఆహ్వానించపోగా.. ఏం జరుగుతుందో చూద్దాం అన్నట్లుగా సీఎం కేసీఆర్ ఉన్నట్లు సమాచారం. కోర్టు సూచనలు మాత్రమే ఇచ్చిందని, సీరియస్ ఆదేశాలు జారీ చేయలేదనే అభిప్రాయం ప్రభుత్వ వర్గాల నుంచి వ్యక్తమవుతోంది. దీంతో చర్చలు జరగడం అనుమానంగానే కనిపిస్తోంది.

‘‘సమ్మెను విరమింపజేసేలా కార్మికుల సమస్యలను పరిష్కరించండి. శనివారం ఉదయం 10.30 గంటలకల్లా కార్మిక సంఘాలతో చర్చలు ప్రారంభించండి’’ అని హైకోర్టు ధర్మాసనం ప్రభుత్వానికి సూచించింది. దాంతో, కోర్టు వ్యాఖ్యలను సమీక్షించి, సమ్మెపై సీఎం కేసీఆర్‌ ఏదైనా నిర్ణయం తీసుకుంటారని అంతా భావించారు. రాత్రి ఏ సమయమైనా ఏదో ఒక నిర్ణయం వెలువడుతుందని అటు కార్మిక యూనియన్లు, ఇటు రాజకీయ పార్టీలు భావించాయి.

సమ్మెకు దిగిన కార్మిక సంఘాల జేఏసీతో చర్చలు ఎందుకు జరపలేదని ధర్మాసనం ఏఏజీని ప్రశ్నించిన విషయం తెలిసిందే. చర్చలు విఫలమయ్యాయంటూ ఈనెల 5న ప్రభుత్వానికి నివేదిక అందిందని, ఒకసారి చర్చలు విఫలమైతే చట్ట ప్రకారం మళ్లీ చర్చలు ఉండవని ఏఏజీ వివరించారు. కార్మిక శాఖ అధీకృత అధికారి వద్ద సమస్యలు పరిష్కరించుకోవచ్చని పేర్కొంది. కార్మికుల డిమాండ్లు న్యాయ బద్దమేనని కార్మిక శాఖ అధీకృత అధికారి నిర్ధారిస్తే కార్పొరేషన్‌, ప్రభుత్వం అప్పుడేం చేస్తాయని ప్రశ్నించింది. శనివారం తెలంగాణ బంద్‌కు క్యాబ్‌ డ్రైవర్లు, టీఎన్‌జీవోలు కూడా మద్దతు ప్రకటించాయని, ఈ నేపథ్యంలో నిరసన అగ్గి పుట్టిందని, ఆ అగ్గి రాజుకోకుండా చర్యలు చేపట్టాలని సూచిస్తున్నామని ధర్మాసనం పేర్కొంది. ఆర్టీసీని విలీనం చేస్తేనే చర్యలకు సిద్దమంటూ కార్మిక సంఘాలు మొండిగా వ్యవహరించాయని ఏఏజీ ఆరోపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *