ఆర్టీసీ సమ్మె నేపధ్యం…కొన్ని డిమాండ్లకు ఓకే ?

అక్షిత ప్రతినిధి, హైదరాబాద్‌ : ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపధ్యంలో ప్రభుత్వ ధోరణిలో మార్పు వచ్చిందా ? ఈ ప్రశ్నకు ‘అవును’ అనే సమాధానమే వినవస్తోంది. కొన్ని డిమాండ్లను అంగీకరించడం ద్వారా సమ్మెను విరమింపజేసే లేదా వాయిదా వేయించే దిశగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు యోచిస్తున్నట్లు సమాచారం. అయితే ఏయే డిమాండ్లను అంగీకరించాలన్న విషయమై అధ్యయనం చేయాల్సిందిగా అధికారులను సీఎం కేసీఆర్ సూచించినట్లు సమాచారం. ఈ క్రమంలోనే… సీఎం క్యాంపు కార్యాలయమైన ప్రగతిభవన్‌లో ఆదివాయం ఉదయం నుంచి అధికారులు మల్లగుల్లాలు పడుతున్నట్లు తెలిపింది. ముందుగా… ‘సమ్మెను విరమించి, వెంటనే విధుల్లోకి రావాలి’ అని మరోసారి పిలుపునివ్వాలని అధికారులకు సీఎం సూచించినట్టు సమాచారం. ఇదే క్రమంలో… కార్మిక సంఘాల నేతలు సానుకూలంగా స్పందించినపక్షంలో… కొన్ని డిమాండ్లను వెంటనే పరిష్కరించి, కార్మికులకు అనుకూల నిర్ణయాలు తీసుకుందామని కూడా కేసీఆర్ వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ముఖ్యమంత్రి కార్యాలయంలో… ఆర్టీసీ కార్మికుల సమ్మె పరిణామాలను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ఓ ప్రత్యేక విభాగాన్ని కూడా ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇదే సమయంలో సమ్మె ప్రభావం ప్రయాణికులపై పడకుండా ఉండేందుకు అన్ని రకాల చర్యలనూ తీసుకోవాలని, కార్మికులు విధుల్లోకి వచ్చినా, రాకపోయినా… సాధ్యమైనన్ని ఎక్కువ బస్సులను తిప్పాలని కేసీఆర్ సూచించినట్టు ఓ అధికారి వెల్లడించారు. ఇక ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపధ్యంలో అద్దె బస్సుల కోసం సాయంత్రంలోగా ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేయనున్న సంగతి తెలిసిందే. కాగా ప్రభుత్వ ధోరణిలో కాస్త మార్పు కనిపిస్తున్నట్లుగా వినవస్తోన్న నేపధ్యంలో… చర్చలకు రావాలంటూ ప్రభుత్వం నుంచి ఈ సాయంత్రంలోగా కార్మిక సంఘాలకు పిలుపు రానున్నట్లు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే… ప్రస్తుత డిమాండ్లలో అత్యంత ప్రధానమైన ‘ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, కొత్త పీఆర్సీ అమలు’ సహా కొన్ని ప్రధానమైన డిమాండ్ల విషయమై కార్మికులు పట్టుబట్టవచ్చని వినవస్తోంది. మొత్తంమీద ‘మా డిమాండ్లు పరిష్కారమయ్యేంత వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ సమ్మె విరమించేది లేదు’ అంటూ కార్మికులు ఖరాఖండిగా చెబుతున్నారు. మరోవైపు ఇప్పటివరకు ఇటు ప్రభుత్వం కూడా అంతే కఠినంగా వ్యవహరిస్తూ వచ్చింది. అవసరమైతే… ప్రైవేటు డ్రైవర్లు, కండక్లర్లను తాత్కాలిక ప్రాతిపదికన తీసుకుని ఆర్టీసీ బస్సులను నడిపించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం విదితమే. ఇందుకు ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. మొత్తంమీద… ప్రభుత్వం తాజా యోచన నేపధ్యంలో ఇక పరిణామాలు ఎలా మారతాయన్న విషయమై అన్ని వర్గాల్లోనూ ఆసక్తి నెలకొంది.

 

 

 

tags : rtc,  employees,  strike, pragathibhavan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *