హైదరాబాద్, అక్షిత ప్రతినిధి : ఆర్టీసీ సమ్మెపై గవర్నర్ తమిళిసై నేరుగా జోక్యం చేసుకున్నారు. సమ్మె పరిష్కారానికి ఎలాంటి చర్యలు తీసుకున్నది, కార్మికుల డిమాండ్లపై ఏం ఆలోచించారంటూ ఆమె రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ను ప్రశ్నించారు. ప్రస్తుత పరిస్థితిపై సమ్మె విషయంలో తాజా పరిణామాలపై రవాణాశాఖ కార్యదర్శి గవర్నర్‌కు అన్ని విషయాలు వివరించారు. మరికాసేపట్లో మంత్రి పువ్వాడ అజయ్ గవర్నర్‌తో భేటీ కానున్నారు. తమిళిసై తెలంగాణలో జరుగుతున్న పరిణామాలపై క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. విద్యా విధానంతోపాటు ఇతర విషయాలపై ఆమె స్వయంగా రివ్యూ చేశారు. ఆర్టీసీ సమ్మెపై కూడా గవర్నర్ కేంద్రానికి రెండు రోజుల క్రితం నివేదిక ఇచ్చిన విషయం తెలిసిందే. పరిస్థితిని పూసగుచ్చినట్లు ప్రధాని, హోంమంత్రికి వివరించారు. ముఖ్యమంత్రి కాస్త చొరవ చూపినా పరిష్కరించే వీలుండేదని, సమ్మె విషయంలో ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించిందని ఆమె చెప్పారని అంటున్నారు. ఇలాంటి సమయంలో ఆమె నేరుగా రవాణాశాఖతో మాట్లాడడం ఆసక్తికరంగా కనిపిస్తోంది. మరోవైపు ఇప్పటికే ఆర్టీసీ సమ్మె విషయంలో హైకోర్టు సీరియస్ అయింది. 19న బంద్ జరిగేలోగా సమ్మె పరిష్కారానికి చొరవ చూపాలని, సంస్థకు ఎండీని నియమించాలని ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గవర్నర్ జోక్యం కీలకంగా కనిపిస్తోంది.
tags : governor, telangana, rtc, strike