అక్షిత ప్రతినిధి, హైదరాబాద్: సమ్మె కాలంలో మృతి చెందిన ఉద్యోగుల కుటుంబాలకు ఉద్యోగంతో పాటు లక్ష రూపాయల ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఆర్టీసీ ఉద్యోగుల తల్లిదండ్రులకు వైద్య సేవలందిస్తామని ప్రకటించారు. ఆర్టీసీ కార్మికులతో సీఎం కేసీఆర్ ఆదివారం ప్రగతి భవన్లో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఆర్టీసీ మహిళా ఉద్యోగులకు ప్రసూతి సెలవులు మంజూరు చేయడంతో పాటు రాత్రి 8 గంటలకు విధులు ముగిసేలా వారికి డ్యూటీలు వేయాలని అధికారులను ఆదేశించారు.
అదేవిధంగా ఆర్టీసీ ఉద్యోగుల పిల్లలకు బస్‌పాస్‌లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆర్టీసీలో ఒక్క ఉద్యోగినీ ఉద్యోగం లోంచి తీసేయకుండా ఉద్యోగ భద్రత కల్పిస్తామని, ఒక్క రూట్లో ఒక్క ప్రైవేట్ బస్సును కూడా అనుమతినివ్వమని ప్రకటించారు. వచ్చే ఏడాది నుంచి ప్రతీ ఏటా బడ్జెట్లో ఆర్టీసీకి వెయ్యి కోట్ల రూపాయలిస్తామని వెల్లడించారు. నాలుగు నెలల్లోనే సంస్థ లాభాల బాట పట్టాలని, ప్రతీ ఏడాది వెయ్యి కోట్ల రూపాయల లాభం ఆర్టీసీకి రావాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు.