ఆర్టీసీ భవిష్యత్‌ కోసమే…సమ్మె : అశ్వద్ధామరెడ్డి

అక్షిత ప్రతినిధి, హైదరాబాద్ : ఆర్టీసీ భవిష్యత్‌ కోసమే తాము సమ్మె తలపెట్టామని, జీతభత్యాల కోసం కాదని టీఎంయూ ప్రధాన కార్యదర్శి అశ్వద్ధామరెడ్డి అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆర్టీసీతో తనకు సంబంధం లేదన్న మంత్రి పువ్వాడ అజయ్ అర్ధరాత్రి ప్రెస్‌మీట్‌ పెట్టి..ఉద్యోగాల నుంచి తీసేస్తామని ప్రకటించారని, మంత్రి ఏనాడైనా తెలంగాణ ఉద్యమంలో ఉన్నారా? అని ప్రశ్నించారు. గతంలో కేసీఆర్ వైఖరిని ఇదే పువ్వాడ అజయ్ తప్పుబట్టిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఆర్టీసీని మూసేసి భూములు సొంతం చేసుకోవాలని ప్రభుత్వం చూస్తోందని అశ్వద్ధామరెడ్డి ఆరోపించారు. టీఆర్ఎస్ ఎంపీ బినామి టెండర్‌లో నాలుగు ఎకరాలు దక్కించుకున్నారని, కేసీఆర్ కుటుంబం బస్ భవన్ పక్కన స్థలం అడిగితే.. వెంటనే లీజుకు ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నారని ఆయన అన్నారు. తమ పోరాటం కేసీఆర్ పతనానికి నాంది అని, కుప్పకూలితే మళ్లీ అధికారంలోకి రాలేరని ఆయన అన్నారు. 88మందిని గెలిపించినా 12 మంది ఎమ్మెల్యేలను ఎందుకు కొన్నారని సీఎంను ఉద్దేశించి అశ్వద్ధామరెడ్డి ప్రశ్నించారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె చట్ట విరుద్దం ఎలా అవుతుందని నిలదీశారు. ఆర్టీసీలో ఇంతటి దుర్భర పరిస్థితి ఎన్నడూ లేదన్నారు. ఏపీలో మాదిరిగా తెలంగాణలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని అశ్వద్ధామరెడ్డి డిమాండ్ చేశారు.
tags : rtc, strike, ashwathamareddy

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *