ఆర్టీసీ బలోపేతం ధ్యేయo : సీఎం

హైదరాబాద్, అక్షిత ప్రతినిధి : ఆర్టీసీని పూర్తిగా ప్రైవేటీకరించడం ప్రభుత్వానికి ఏమాత్రం ఇష్టంలేదని, ఆర్టీసీ ఉండి తీరాల్సిందేనని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు స్పష్టంచేశారు. ప్రజలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అసౌకర్యం కలుగకుండా చూడటమే ప్రభుత్వ ధ్యేయమని చెప్పారు. తదనుగుణంగానే ఆర్టీసీని పటిష్ఠపర్చేందుకు అనేకచర్యలు చేపడుతున్నామని తెలిపారు. మొత్తం ఆర్టీసీని ప్రైవేట్‌పరం చేయడం వివేకమైన చర్యకాదనికూడా అన్నారు. క్రమశిక్షణను తు.చ. తప్పకుండా అమలుచేసి, ఆర్టీసీని లాభాలబాటలో నడిపించడానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. రవాణాశాఖ ముఖ్యకార్యదర్శి సునిల్‌శర్మ అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ ఆర్టీసీకి సంబంధించిన ప్రతిపాదనలను ముఖ్యమంత్రికి అందజేసింది. వాటిపై సోమవారం ప్రగతిభవన్‌లో సీఎం అధ్యక్షతన జరిగిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో కూలంకషంగా చర్చించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ప్రస్తుతం ఆర్టీసీలో 10,400 బస్సులున్నాయి. వీటిని భవిష్యత్‌లో మూడురకాలుగా విభజించి నడపాలి. 50% బస్సులు అంటే 5200 పూర్తిగా ఆర్టీసీకి చెందినవై, ఆర్టీసీ యాజమాన్యంలోనే ఉంటాయి. 30%.. అంటే 3100 బస్సులు అద్దె రూపేణా తీసుకుని వాటిని కూడా పూర్తిగా ఆర్టీసీ పర్యవేక్షణలోనే, ఆర్టీసీ పాలన కిందే నడుపుతారు. వాటిని ఆర్టీసీ డిపోల్లోనే ఉంచుతారు. మరో 20%.. అంటే 2100 బస్సులు పూర్తిగా ప్రైవేట్‌వి. ప్రైవేట్ స్టేజ్‌క్యారేజ్‌విగా అనుమతి ఇస్తారు. ఈ బస్సులు పల్లెవెలుగు సర్వీసు కూడా నడపాలి. అద్దెకు తీసుకున్న బస్సులు, స్టేజ్‌క్యారేజ్ బస్సులు ఇతర రూట్లతోపాటు నగరంలోనూ నడపాలి అని చెప్పారు. ఆర్టీసీ చార్జీలు, ప్రైవేట్ బస్సుల చార్జీలు సమానంగా, ఆర్టీసీ నియంత్రణలోనే ఉంటాయి. ఆర్టీసీ చార్జీలను పెంచినప్పుడే వాళ్ల చార్జీలు కూడా పెంచాలి. స్వల్పంగా పెంచడం కూడా ఆర్టీసీ కమిటీ నిర్ణయం మేరకు, అవసరమని భావించినప్పుడు చేయాలి. ఇప్పటికే 21% అద్దె బస్సులను ఆర్టీసీ నడుపుతున్నది. అంటే, ఇక అద్దెకు తీసుకోవాల్సింది అదనంగా మరో 9% మాత్రమే. అదనంగా 9% అద్దె బస్సులను పెంచడం అంటే ఆర్టీసీకి కొత్త బస్సులు వచ్చినట్లే అని సీఎం తెలిపారు. ఈ చర్యలన్నీ చేపట్టడానికి ప్రధానకారణం ఆర్టీసీ యూనియన్ల అతిప్రవర్తనేనని సీఎం కేసీఆర్ అన్నారు. తాము ఎక్కిన చెట్టుకొమ్మను తామే నరుక్కున్నారు. గత 40 ఏండ్లుగా జరుగుతున్న దాష్టీకంవల్ల ఇదంతా చేయాల్సి వచ్చింది. టీడీపీ, కాంగ్రెస్ ప్రభుత్వాల్లో సమ్మెచేసిన ఆర్టీసీ యూనియన్లు, టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో కూడా సమ్మెకు దిగాయి. ప్రభుత్వం ఏది ఉన్నా వీళ్ల అతిప్రవర్తనలో మార్పులేదు. పకడ్బందీ నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ మేనేజ్‌మెంట్‌కు ఈ యూనియన్లు ఇవ్వవు. ఏదేమైనా ప్రజలకు ఇబ్బంది కలుగకుండా చూడటమే ప్రభుత్వ ధ్యేయం. పండుగలకు, విద్యార్థుల పరీక్షలకు ఎవరూ కష్టపడకూడదని ప్రభుత్వ ఉద్దేశం. సమ్మె ఉధృతం చేస్తామనటం హాస్యాస్పదం అని చెప్పారు.

 

 

tags : tsrtc, strike, kcr, pragathibhavan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *