అక్షిత ప్రతినిధి, హైదరాబాద్: ఈ నెల 5వ తేదీ నుంచి సమ్మె చేపట్టాలని ఆర్టీసీ కార్మిక సంఘాలు పిలుపునివ్వడంతో.. వారి సమస్యలపై చర్చించేందుకు ప్రభుత్వం ముగ్గురు ఐఏఎస్ అధికారులతో ఓ కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. సోమేశ్ కుమార్, రామకృష్ణారావు, సునీల్ శర్మతో కమిటీని ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఇవాళ ఆర్టీసీ జేఏసీ నేతలతో త్రిసభ్య కమిటీ సమావేశం జరిగింది. సమావేశం ముగిసిన అనంతరం సోమేశ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. ఆర్టీసీ జేఏసీ ఇచ్చిన సమ్మె నోటీసుపై చర్చించామని తెలిపారు. దసరా పండుగ ముందు సమ్మె వద్దని ఆర్టీసీ జేఏసీకి విజ్ఞప్తి చేశామన్నారు. ఆర్టీసీ సమస్యలను సమూలంగా పరిష్కరించేందుకే యత్నిస్తున్నాం. ముందుగా తక్షణం పరిష్కారమయ్యే అంశాలపై చర్చించాం. తర్వాత దీర్ఘకాలిక పరిష్కార మార్గాలపై చర్చించాం. ఆర్టీసీపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టారని సోమేశ్ కుమార్ పేర్కొన్నారు. ఆర్టీసీ జేఏసీ లేవనెత్తిన 26 అంశాలపై చర్చిస్తాం. ఆర్టీసీ పరిరక్షణపై ప్రభుత్వానికి నివేదిక ఇస్తాం. 26 డిమాండ్లను పరిశీలించి సమగ్ర నివేదిక ఇస్తాం. ప్రభుత్వానికి నివేదిక ఇచ్చేందుకు సమయం పడుతుందని సోమేశ్ కుమార్ స్పష్టం చేశారు.
tags : rtc, strike, someshkumar