ఆర్టిసి బస్సు …నా జీవితానికి బాటలు వేసింది : నల్లమోతు శ్రీధర్

 

ఆర్టిసి బస్సు నా జీవితానికి బాటలు వేసింది..! గుంటూరు జిల్లా బాపట్ల 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న చెరువు జమ్ములపాలెం అనేది మా గ్రామం. కాలేజీకి వెళ్లాలంటే ఆర్టిసి బస్సు కోసం వెయిట్ చేసి, ముందు ఊళ్లల్లోనే అది నిండి పోయి వస్తే, తప్పనిసరి పరిస్థితుల్లో వెనక నిచ్చెన ఎక్కి రూఫ్ టాప్ మీద ప్రయాణించి కాలేజీకి చేరుకున్న సందర్భాలు అనేకం!

నాకే కాదు.. గ్రామీణ ప్రాంతాల్లో పుట్టిన మనలో చాలా మందికి RTCతో అవినాభావ సంబంధం. ముఖ్యంగా రోజు టికెట్ అందించే కండక్టర్, కొన్నాళ్లు అలవాటైతే చాలు, మన కోసం ప్రత్యేకంగా మనకు కావలసిన దగ్గర బస్ ఆపే డ్రైవర్ చాలా మంది యువతీ యువకులకు కుటుంబ సభ్యులుగా మారిపోతారు.

అలాంటి ఆర్టీసీ కార్మికులు చాలా కష్టంలో ఉన్నారు. నాకు తెలిసి ఏ ఆర్టీసీ కార్మికుడు కోట్లాది రూపాయలు సంపాదించలేదు. అతి సాదాసీదాగా తన జీవితం మొత్తాన్ని సర్వీస్ కే అంకితం చేసి, రిటైర్ అయ్యేటంత వరకూ గొడ్డు చాకిరీ చేస్తాడు. అయినా కూడా సమాజం వాళ్లని పెద్దగా పట్టించుకోదు. చాలాచోట్ల కనిపించే విధంగానే “ఆర్టీసీ చక్రాలు, ప్రగతికి రధచక్రాలు” అనడంలో సందేహమే లేదు. చదువుకునే పిల్లల్ని గమ్యస్థానాలకు చేర్చడం మొదలుకుని, కూరగాయలు, ఇతర చిన్న చిన్న సరుకులు దగ్గరలో ఉన్న పట్టణానికి వెళ్లి అమ్ముకుని వచ్చి దాంతోనే జీవితం గడిపే ఎంతోమందికి ఆర్టీసి ప్రాణం పోసింది.

చివరకు ఎక్కడికక్కడ ఆటోలు, ప్రైవేట్ వ్యాన్లు రాజ్యమేలుతూ, ప్రమాదకరంగా డ్రైవింగ్ చేస్తూ జనాల ప్రాణాలను ఫణంగా పెడుతున్నప్పటికీ, ఆటో డ్రైవర్లు చాలాసార్లు ఆర్టిసీ వాళ్లని కనీసం లెక్కచేయకుండా రోడ్డుమీద ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నప్పటికీ.. ఏ ఆర్టిసీ కార్మికుడూ తమ స్టెబిలిటీ కోల్పోవడం నేను గమనించలేదు. ఒక అద్భుతమైన వ్యవస్థను మనమూ, ప్రభుత్వాలూ చేజేతులా నాశనం చేస్తున్నాం.

ఇవాళ రేపు విదేశాల్లో గొప్ప గొప్ప స్థానంలో ఉన్న వారికి కూడా మన భవిష్యత్ ను తీర్చిదిద్దిన ఆర్టీసీ, దాని కార్మికులు ఇప్పుడు కష్టాల్లో ఉంటే మనం అతి మామూలుగా మనకేం సంబంధం లేనట్లు బ్రతికేస్తున్నాం. మన అసమర్థతను, నిర్లిప్తతను చూస్తే మనం చిన్నప్పుడు చూసిన ఆర్టీసీ కార్మికుడు.. “ఇలాంటి వాళ్ళనా గమ్యస్థానాలకు చేర్చింది” అని గుండెలు బాదుకోవడం ఖాయం.

– Nallamothu Sridhar

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *