ఆరుగురు మంత్రుల ప్రమాణస్వీకారం

అక్షిత ప్రతినిధి, హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ కేబినెట్ లో కొత్తగా ఆరుగురికి అవకాశం దక్కింది. టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్‌, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌, ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌ కుమార్‌ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. రాజ్ భవన్ లో గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ నూతన మంత్రులతో ప్రమాణస్వీకారం చేయించారు.

గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ మొదట హరీశ్ రావుతో మంత్రిగా ప్రమాణస్వీకారం చేయించారు. ప్రమాణస్వీకారం అనంతరం మంత్రి హరీశ్ రావు సీఎం కేసీఆర్ ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ కేటీఆర్ తో మంత్రిగా ప్రమాణస్వీకారం చేయించారు. ఆ తర్వాత సబితాఇంద్రారెడ్డి, గంగుల కమలాకర్, సత్యవతి రాథోడ్‌, పువ్వాడ అజయ్‌ కుమార్‌ తో మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయించారు. కేబినెట్ లో ఇప్పటికే 12 మంది మంత్రులుండగా..తాజాగా ఆరుగురు మంత్రులు ప్రమాణస్వీకారం చేయడంతో మంత్రివర్గంలో సభ్యుల సంఖ్య 18కు చేరింది. ప్రమాణస్వీకార కార్యక్రమానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పలువురు సీనియర్ నేతలు హాజరయ్యారు.

ఆరుగురు మంత్రుల రాజకీయ నేపథ్యం..

తన్నీరు హరీశ్ రావు:

six mlas take oath as Telangana ministers

1972, జూన్ 3న జననం. 2004 నుంచి వరుసగా సిద్ధిపేట అసెంబ్లీ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో యువజన సర్వీసుల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. రాష్ట్ర తొలి కేబినెట్ లో నీటి పారుదల, మార్కెటింగ్, శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.

కే తారకరామారావు:

1976, జులై 24న జననం. 2006లో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. 2009 నుంచి సిరిసిల్ల శాసనసభ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తెలంగాణ తొలి కేబినెట్ లో ఐటీ, మున్సిపల్, పంచాయతీ రాజ్ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2018 డిసెంబర్ లో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు స్వీకరించారు.

పట్లోళ్ల సబితాఇంద్రారెడ్డి:

1963 మే 5న జన్మించారు. 2004, 2009లో చేవెళ్ల స్థానం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. దేశంలోనే తొలి మహిళా హోంమంత్రిగా విధులు నిర్వర్తించారు. 2004 నుంచి 2009 వరకు ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా బాధ్యతలు వహించారు. 2009 నుంచి 2014 వరకు ఉమ్మడి రాష్ట్రంలో హోంమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2018లో మరోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు.

గంగుల కమలాకర్ :

1968 మే 8న జన్మించారు. 2009లో తొలిసారిగా కరీంనగర్ శాసనసభకు ప్రాతినిధ్యం వహించారు. 2014, 2018 ఎన్నికల్లో వరుసగా కరీంనగర్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు.

సత్యవతి రాథోడ్ :

2009లో తొలిసారి డోర్నకల్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2014లో టీఆర్ ఎస్ లో చేరారు. 2019లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.

పువ్వాడ అజయ్ కుమార్ :

బెంగళూరు విశ్వవిశ్వవిద్యాలయం నుంచి అగ్రికల్చర్ లో మాస్గర్స్ డిగ్రీ పూర్తి చేశారు. 2014లో ఖమ్మం నియోజకవర్గం నుంచి తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2016లో టీఆర్ఎస్ లో చేరారు. 2018లో వరుసగా రెండోసారి ఖమ్మం ఎమ్మెల్యేగా విజయం సాధించారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *