ఆత్మ హత్యలకు వేదికగా… తెలంగాణ

– నిరుద్యోగుల ఆత్మ‌హ‌త్య‌ల‌పై స్పందించని కేసీఆర్
– ఉద్యోగాలకై ల‌క్ష‌లాది మంది చూపు
– ఏడేళ్లుగా డీఎస్సీ జాడ లేదు
– అందని ద్రాక్షలా… పేదల విద్య
కేసిఆర్ పై మండిపడ్డ మంద కృష్ణ మాదిగ

నాగార్జున సాగర్, అక్షిత ప్రతినిధి :

యువతలో కమ్ముకున్న కారు చీకట్లు. చదివి, చదివి… ఉద్యోగాలు లేక బతుకు బండి గుదిబండగా పరిణమించింది. నోటిఫికేషన్లు లేకపోవడం ఒక ఎతైతే… కరోనా ఉన్న ఉద్యోగాలను మింగివేసింది. ఉన్నత చదువులు చదివినప్పటికి ప్రభుత్వ ఉద్యోగాలు లేక అల్లాడుతున్న యువతకు కాసింత ఊ తంగా ఉంటుందని భావించి ప్రైవేట్ ఉద్యోగాల్లో చేరితే కరోనా ఉన్న ఉద్యోగాలను ఊడబెరికింది. ఎండ్ల తరబడి టీచర్స్ నియామకాలు లేక ప్రైవేట్ టీచర్ లుగా చేరితే కరోనా కకావికలం చేసింది. లాక్ డౌన్, విద్యాసంస్థల బంద్ ప్రైవేట్ ఉపాధ్యాయుల పాలిట యమ పాశంగా పరిణమించింది. నీళ్ళు, నిధులు, నియామకాలకై సాధించుకున్న తెలంగాణ… ఆ దిశలో ఉద్యోగాల కల్పనలో ప్రభుత్వ మొండి వైఖరిని నిరసిస్తూ యువత ఆత్మహత్యల దారి పడుతుండ్రు. మొన్న సునీల్ నాయక్, నిన్న ప్రైవేట్ టీచర్ రవికుమార్, ఈ రోజు రవికుమార్ భార్య అక్కమ్మ ఆత్మ హత్యలకు పాల్పడ్డారు. సాగర్ ఉప ఎన్నికల్లో పోరు.. బీకర యుద్ధంగా ఉన్న పరిస్థితుల్లో అదే సాగర్ నడిబొడ్డున ప్రైవేట్ టీచర్ రవికుమార్, అతని భార్య అక్కమ్మ దంపతులు తనువు చాలించారు. కుటుంబ జీవనం కష్టతరంగా భావించి దంపతులిద్దరూ రెండు రోజుల వ్యవధిలో తనువు చాలించడo తో పదేళ్ల వయసున్న
ఇద్దరి చిన్నారుల వ్యధ అందరిని
కంట తడి పెట్టించింది. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ.. ఆత్మ‌హ‌త్య‌ల రాష్ట్రంగా మారింద‌ని ఎమ్మార్పీఎస్ వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడు, మ‌హాజ‌న సోష‌లిస్టు పార్టీ జాతీయ అధ్య‌క్షుడు మంద కృష్ణ మాదిగ దుయ్య‌బ‌ట్టారు. రోజుకో యువ‌కుడు ఆత్మ‌హ‌త్యకు పాల్ప‌డుతున్నా సీఎం కేసీఆర్ ఎందుకు స్పందించ‌డం లేద‌ని ఆయ‌న నిల‌దీశారు. పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో సీఎం కేసీఆర్ కుటుంబంలోనే ఉద్యోగాలు వ‌చ్చాయ‌ని, నిరుద్యోగుల‌కు మాత్రం నిరాశే మిగిలిందని మంద కృష్ణ
మాదిగ మండిప‌డ్డారు. ఈ నిరుద్యోగుల ఆత్మ‌హ‌త్య‌ల‌కు కేసీఆర్ ప్ర‌భుత్వ‌మే కార‌ణ‌మ‌ని ఆయ‌న ఆరోపించారు. మొన్న కాక‌తీయ యూనివ‌ర్సిటికి చెందిన విద్యార్థి సునీల్ నాయ‌క్‌, నిన్న నాగార్జున సాగ‌ర్‌లో ఒక ప్ర‌యివేట్ టీచ‌ర్ ర‌వికుమార్ ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ‌గా.. ఇప్పుడు ర‌వికుమార్ భార్య అక్కమ్మ సాగ‌ర్ కాల్వ‌లో ప‌డి ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డం బాధ‌క‌ర‌మ‌ని ఆయ‌న ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. నాగార్జున సాగ‌ర్ ఉప ఎన్నిక‌లో భాగంగా మ‌హాజ‌న సోష‌లిస్టు పార్టీ అభ్య‌ర్థి ఆడెపు నాగార్జున విజ‌యం కోసం మంద కృష్ణ మాదిగ విస్తతంగా ప్ర‌చారం నిర్వ‌హిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ నీళ్లు, నిధులు, నియామ‌కాల కోసం జ‌రిగిన పోరాటం.. చివ‌ర‌కు కేసీఆర్ కుటుంబానికే మేలు జరిగింద‌ని దుయ్య‌బ‌ట్టారు. రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత రెండు ప‌ర్యాయాలు అధికారంలోకి వ‌చ్చిన టీఆర్ ఎస్ ఏడేళ్లేగా డీఎస్సీ వేయ‌క‌పోవ‌డంతో.. ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో వేలాదిగా టీచ‌ర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయ‌ని ఆయ‌న వివ‌రించారు. ఉన్న‌త చ‌దువులు చ‌దివి ఉద్యోగాలు రాక‌పోవ‌డంతో నిరుద్యోగ యువ‌త నైరాశ్యంలోకి వెళ్లుతోంద‌న్నారు. హైద‌రాబాద్‌లో ఉండ‌లేక‌.. గ్రామాల‌కు వ‌చ్చి కూలీ ప‌నులు చేయ‌లేక స‌త‌మ‌త‌వుతున్నార‌ని ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు. టీచ‌ర్ పోస్టులు భ‌ర్తీ చేయ‌క‌పోవ‌డానికి కార‌ణం పేద విద్యార్థుల‌ను విద్య‌కు దూరం చేయ‌డానికే టీఆర్ ఎస్ ప్ర‌భుత్వం కుట్ర చేస్తోంద‌ని ఆయ‌న విమ‌ర్శించారు.

రవికుమార్ కుటుంబాన్ని ఆదుకోవాలి
ప్రైవేట్ టీచర్ రవికుమార్ అతని భార్య అక్కమ్మ దంపతులు తనువు చాలించడoతో అనాధలైన
ఇద్దరు పిల్లల భవిష్యత్ అంధకారమైందని మంద కృష్ణ మాదిగ మండిపడ్డారు. ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం మొండి వైఖరిని వీడి ప్రభుత్వ విద్యా వ్యవస్థను పటిష్టం చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యా రంగాన్ని తగిన నిధులను కేటాయించి ఆయా ప్రభుత్వ విద్యాలయాల్లో కార్పొరేట్ స్థాయిలో మౌలిక సదుపాయాలను కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రతి ఏడాది రూ.5 వేల కోట్ల ప్రత్యేక నిధులను కేటాయించి ప్రభుత్వ పాఠశాలలకు పూర్వ వైభవం తేవాలన్నారు. పేదలకు అందని ద్రాక్షలా విద్యా వ్యవస్థను ఉంచకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం తగిన రీతిలో స్పందించకపోతే మహా జన సోషలిస్ట్ పార్టీ ఆధ్వర్యలో ఉద్యమిస్తామని మంద కృష్ణ మాదిగ హెచ్చరించారు.

బడుగులకు అండగా… ఎంఎస్ పి
బడుగు, బలహీన వర్గాలకు అండగా మహా జన సోషలిస్ట్ పార్టీ ఉంటుందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. సాగర్ ఉప ఎన్నికల్లో ఎం ఎస్ పి అభ్యర్ధిగా ఆడేపు నాగార్జునను బరిలో నిలిపామన్నారు. మహా జనులంతా ట్రాక్టర్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని ఆయన కోరారు. మహా జనుల గొంతును వినిపించేందుకు అవకాశం కల్పించాలని ఆయన ఓటర్లను అభ్యర్థించారు. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపి పార్టీలన్నీ అగ్ర వర్ణాల కబంధ హస్తాల్లో చిక్కుకున్నాయని, మన సమస్యలను ప్రస్తావించేందుకు మన గొంతుక అవసరమన్నారు. అన్నీ సామాజిక అంశాలను పరిగణనలోకి తీసుకుని ఎన్నో ఉద్యమాలు సాగించానని, మన అభ్యర్ధి గెలిస్తే మరింత పోరు సాగించేందుకు ఊతమౌతుందన్నారు. అందుకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు తమ అభ్యర్థి ట్రాక్టర్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *