మేకిన్ ఇండియా అంటే కంపెనీలు వస్తాయా? : కేటీఆర్
హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :
దిగుమతి సుంకాలు పెంచి.. మేకిన్ ఇండియా అంటే కంపెనీలు వస్తాయా? అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కేంద్రాన్ని ప్రశ్నించారు. శుక్రవారం బేగంపేటలో సీసీఐ రాష్ట్ర వార్షిక సమావేశం జరిగింది. కార్యక్రమానికి కేటీఆర్‌తో పాటు పారిశ్రామిక వేత్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆత్మనిర్భర్ భారత్ నినాదం ఇస్తే సరిపోదు.. ఇందుకు తగిన చర్యలు కూడా చేపట్టాలన్నారు. ఇండియా టీకాల రాజధానిగా తెలంగాణ మారిందన్నారు. ఐటీ, లైఫ్ సెన్సెస్, ఫార్మా, నిర్మాణ రంగాల్లో అగ్రస్థానంలో ఉన్నామన్నారు. ఐటీ ఎగుమతులు రూ.1.40లక్షల కోట్లకు చేరాయని, స్టార్టప్‌లతో తెలంగాణ ఇన్నోవేషన్ హబ్‌గా మారుతోందన్నారు. రాష్ట్రంలో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు సీఎం కేసీఆర్ అనేక చర్యలు తీసుకుంటున్నారని, స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. డిఫెన్స్, ఏరోస్పేస్ రంగానికి హైదరాబాద్ నిలయంగా ఉందన్నారు.
విభజన హామీలు నిలబెట్టుకోలే..
తెలంగాణకు ఇచ్చిన ఏ హామీని కేంద్రం నిలబెట్టుకోలేదని, అలాగే విభజన సమస్యలు పరిష్కరించలేదని కేటీఆర్ అన్నారు. గత ఆరేండ్లలో తెలంగాణకు ఎలాంటి ప్రత్యేక రాయితీలు ఇవ్వలేదని గుర్తు చేశారు. వరంగల్‌లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామన్నారని, కోచ్ ఫ్యాక్టరీకి 60 ఎకరాలు అడిగితే 150 ఎకరాలు ఇచ్చామన్నారు. ఐటీఐఆర్ రద్దు చేసిన తెలంగాణకు న్యాయం చేశారని, తెలంగాణకు ఒక్క ఇండస్ట్రియల్ జోన్ ఇవ్వలేదని ఆరోపించారు. బయ్యారం ఉక్కు ఊసేలేదన్నారు. కేంద్రం ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే ఎవరిని అడగాలని ప్రశ్నించారు. కేంద్రం ఎన్నికల కోసం కాకుండా.. ప్రజల కోసం, దేశం కోసం పని చేయాలన్నారు. రాష్ట్రం నుంచే అధిక రెవెన్యూ తీసుకుంటూ అన్యాయం చేస్తున్నారన్నారు. బుల్లెట్ రైలు గుజరాత్‌కేనా.. హైదరాబాద్‌కు అర్హత లేదా? అని ప్రశ్నించారు.