ఆక్రమణలో… అసైన్డ్ భూమి

మెదక్‌ కలెక్టర్‌ హరీశ్‌

మెదక్‌, అక్షిత ప్రతినిధి : మంత్రి ఈటల రాజేందర్‌ భూ కబ్జా వ్యవహారంలో మెదక్‌ జిల్లా కలెక్టర్‌ హరీశ్‌ విచారణ చేపట్టారు. అచ్చంపేటలో రైతుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. విజిలెన్స్‌ విచారణ తీరును కలెక్టర్‌ పరిశీలించారు. మంత్రి ఈటల అసైన్డ్‌ భూమిని ఆక్రమించినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని, ఇది చట్టపరంగా నేరమన్నారు. భూ కబ్జాకు సంబంధించి క్షేత్రస్థాయిలో సర్వే పూర్తయిన తర్వాత ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని తెలిపారు. మంత్రి ఈటల రాజేందర్‌ తమ భూములను కబ్జా చేశారన్న రైతుల ఫిర్యాదుపై అవినీతి నిరోధక శాఖ, విజిలెన్స్‌, రెవెన్యూ అధికారులు విచారణ ప్రారంభించారు. శనివారం ఉదయం మాసాయిపేట మండలం అచ్చంపేటకు చేరుకున్న అధికారులు.. మంత్రిపై ఫిర్యాదు చేసిన రైతుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. అసైన్డ్‌దారులను ఒక్కొక్కరిగా పిలిచి విచారిస్తున్నారు. తూప్రాన్‌ ఆర్డీవో రాంప్రకాశ్‌ నేతృత్వంలో ఆరు ప్రత్యేక బృందాలతో గ్రామంలోని భూములను సర్వే చేస్తున్నారు. ఇందులో భాగంగా మంత్రి ఈటలకు చెందిన హేచరీస్‌లో, దాని పక్కనే ఉన్న అసైన్డ్‌ భూముల్లో డిజిటల్‌ సర్వే నిర్వహించారు.మంత్రి ఈటల రాజేందర్‌ తమ అసైన్డ్‌ భూములను కబ్జా చేశారని అచ్చంపేటకు చెందిన రైతులు సీఎం కేసీఆర్‌కు నిన్న ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. రైతుల ఫిర్యాదుపై సీఎం సమగ్ర విచారణకు ఆదేశించారు. ఈ క్రమంలో మంత్రి భూ వివాదంపై అధికారులు అచ్చంపేటలో విచారణ చేపట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *