ఆకాశంలో అద్భుతం: ఆసక్తిగా తిలకించిన ప్రజలు – ముగిసిన సూర్య గ్రహణం

అక్షిత ప్రతినిధి, హైదరాబాద్‌: ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతమైంది. సుమారు పది సంవత్సరాల తర్వాత పూర్తి స్థాయి సూర్యగ్రహణం ఆకాశంలో కనువిందు చేసింది. ఉదయం 8.15 నిమిషాలకు ప్రారంభమైన ఈ సుందర ఘట్టం దాదాపు 3 గంటల పాటు సాగింది. అరుదుగా సంభవించే ఘట్టాన్ని వీక్షించేందుకు తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులు, చిన్నారులు, పెద్దలు ఆసక్తి చూపారు. రోడ్లపైకి వచ్చి సూర్య గ్రహణాన్ని ఆసక్తిగా తిలకించారు. అరుదైన సూర్యగ్రహణం ముగిసిన అనంతరం తెలుగు రాష్ట్రాల్లోని పలు దేవాలయాల్లో సంప్రోక్షణ చర్యలు చేపట్టారు.  ఆలయాల శుద్ధి అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించనున్నారు.

విజయవాడలో ప్రత్యేక ఏర్పాట్లు

విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో సూర్యగ్రహణాన్ని వీక్షించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రత్యేకంగా తయారు చేసిన సోలార్ ఫిల్టర్ ద్వారా విద్యార్థులు ఈ సుందర ఘట్టాన్ని వీక్షించారు. అదే విధంగా విద్యార్థులకు సూర్యగ్రహణ ప్రాముఖ్యతను, ఏర్పడేందుకు గల కారణాలను వివరించారు.

కర్నూలు కొండారెడ్డి బురుజు వద్ద అల్పాహారం 

సూర్యగ్రహణం పట్ల ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కర్నూలు నగరంలో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో అవగాహన సదస్సులు ఏర్పాటు చేశారు. సోలార్‌ ఫిల్టర్లు ఉపయోగించి గ్రహణాన్ని ఎలా చూడాలో ప్రజలకు, విద్యార్థులకు తెలియజేశారు. గ్రహణ సమయంలో వచ్చే అతినీలలోహిత కిరణాల వల్ల కంటికి ప్రమాదం ఉన్నందున సోలార్‌ ఫిల్టర్‌ ద్వారా వీక్షించవచ్చనని ప్రజలకు తెలియజేశారు. గ్రహణ సమయంలో ఆహారం తీసుకోవద్దు, బయటకు రాకూడదని ఎన్నో అపోహలున్నాయి. వాటిని పోగొట్టేందుకు కొన్ని సంస్థలు అవగాహన సదస్సులు నిర్వహించాయి. ఇందులో భాగంగానే గ్రహణ సమయంలో నగరంలోని కొండారెడ్డి బురుజు వద్ద అల్పాహారాన్ని ఏర్పాటు చేసి తినాలని  ప్రజలను ప్రోత్సహించారు.

ఆకాశంలో అద్భుతం: ఆసక్తిగా తిలకించిన ప్రజలు

జగిత్యాలలో రాహు కేతు పూజలు

కేతుగ్రస్ర సూర్య గ్రహణాన్ని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోగల అయ్యప్ప గుట్టపై ఉన్న రాహుకేతు సహిత నవనాగు ఆలయంలో  సామూహిక రాహుకేతు నివారణ పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు పాలేపు రామకృష్ణ శర్మ ఆధ్వర్యంలో ఈ పూజలు నిర్వహించారు. కాలసర్పదోషం నివారణ కోసం ఈ ఆలయంలో ప్రతిఏటా ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. గ్రహణం రోజు దేశవ్యాప్తంగా అన్ని దేవాలయాలు మూసివేసి ఉంటే ఇక్కడ మాత్రం ప్రత్యేక పూజలు నిర్వహించటం విశేషం. గ్రహణం రోజు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకుని రాహుకేతు పూజలు నిర్వహించారు.

ఓరుగల్లులో కమ్ముకున్న మేఘాలు

ఆకాశంలో ఆవిష్కృతమైన అద్భుత ఘట్టాన్ని ఓరుగల్లు వాసులు వీక్షించలేకపోయారు. ఉదయం నుంచి నింగిలో మబ్బులు కమ్ముకోవడంతో ప్రజలు ఈ సూర్యగ్రహణాన్ని వీక్షించలేకపోయారు. ఉదయం నుంచి ఎంతో ఆశగా ఎదురుచూసినా గ్రహణం కనిపించకపోవడంతో ప్రజలు నిరాశకు గురయ్యారు. జనగామలో పాక్షికంగా సూర్యగ్రహణం కనిపించింది. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా, ములుగు జిల్లాలోని పలు మండలాల్లో ఉదయం చిరుజల్లులు కురిశాయి.

Loading video

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *