అసెంబ్లీలోచీఫ్‌విప్‌గా వినయ్‌భాస్కర్

-మండలిలో బీ వెంకటేశ్వర్లు
-అసెంబ్లీలో విప్‌లుగా మరో ఆరుగురికి చాన్స్
-మండలిలో విప్‌లుగా నలుగురు

అక్షిత ప్రతినిధి, హైదరాబాద్ : సోమవారం నుంచి శాసనసభ బడ్జెట్ సమావేశాలు జరుగనున్న నేపథ్యంలో ఉభయ సభల్లో విప్‌ల పదవులను సీఎం కేసీఆర్ భర్తీచేశారు. అసెంబ్లీ చీఫ్ విప్‌గా వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే దాస్యం వినయభాస్కర్‌ను, మండలిలో చీఫ్ విప్‌గా ఎమ్మెల్సీ బోడకుంటి వెంకటేశ్వర్లును నియమించారు. వీరితోపాటు అసెంబ్లీలో విప్‌లుగా ఎమ్మెల్యేలు గొంగిడి సునీత, గంప గోవర్ధన్, బాల్క సుమన్, గువ్వల బాలరాజు, అరికెపూడి గాంధీ, రేగ కాంతారావును.. మండలిలో విప్‌లుగా కే దామోదర్‌రెడ్డి, ఎమ్మెస్ ప్రభాకర్‌రావు, టీ భానుప్రసాద్‌రావు, కర్నె ప్రభాకర్‌ను నియమించారు. చీఫ్ విప్, విప్‌ల ఎంపికలో సామాజిక సమతూకం పాటించారు.

అత్యధిక జిల్లాలకు ప్రాతినిథ్యం దక్కేలా కూర్పుచేశారు. తెలంగాణ ఉద్యమంలో చురుకుగా వ్యవహరించి.. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన వినయ్‌భాస్కర్ సేవలను గుర్తించి చీఫ్ విప్‌గా ఎంపికచేశారు. మండలిలో చీఫ్‌విప్‌గా నియమితులైన బీ వెంకటేశ్వర్లు ప్రస్తుతం శాసనమండలిలో విప్‌గా కొనసాగుతున్నారు. గతంలో చీఫ్ విప్‌గా పనిచేసిన పాతూరి సుధాకర్‌రెడ్డి ఎమ్మెల్సీగా పదవీకాలం ముగియడంతో కొత్త చీఫ్ విప్‌ను నియమించారు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన గంప గోవర్ధన్, అలేరు నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన గొంగిడి సునీత గత అసెంబ్లీలోనూ విప్‌లుగా పనిచేశారు. సర్పంచ్ స్థాయి నుంచి ఎమ్మెల్యే స్థాయి వరకు ఎదిగిన సునీత తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు.

తెలంగాణ ఉద్యమంలో విద్యార్థి చురుగ్గా వ్యవహరించిన బాల్క సుమన్ 2014లో పెద్దపల్లి ఎంపీగా, 2018 లో చెన్నూరు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గువ్వల బాలరాజు అచ్చంపేట నుంచి, అరికెపూడి గాంధీ శేరిలింగంపల్లి నుంచి వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. టీఆర్‌ఎస్ పార్టీలో చురుగ్గా వ్యవహరించిన కర్నె ప్రభాకర్ విద్యార్థి దశనుంచి ఉద్యమంలో పాల్గొన్నారు. ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న పెద్దపల్లి జిల్లాకు చెందిన భానుప్రసాద్‌రావు రెండోసారి ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు.

bodakunti-venkateswarlu1

ఎమ్మెస్ ప్రభాకర్‌రావు హైదరాబాద్ జిల్లా నుంచి రెండోసారి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. నాగర్‌కర్నూలు జిల్లాకు చెందిన దామోదర్‌రెడ్డి గతంలో జెడ్పీ చైర్మన్‌గా పనిచేశారు. సీఎం కేసీఆర్ విజన్‌కు ఆకర్షితుడైన పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు 11 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో విలీనమయ్యేందుకు బాటలువేశారు. కాగా అసెంబ్లీ, శాసనమండలి సభ్యులతో కూడిన సభాకమిటీలను నియమించాలని సీఎం నిర్ణయించారు. దాదాపు 12 మంది చైర్మన్లుగా, ఇతరులు సభ్యులుగా నియమితులవుతారు. ఈ మేరకు చైర్మన్లు, సభ్యుల ఎంపిక పూర్తయింది. సోమవారం నుంచి ప్రారంభమయ్యే బడ్జెట్ సమావేశాల్లో వీరి పేర్లను సభాపతి అధికారికంగా ప్రకటిస్తారు.

కేటీఆర్ అభినందనలు..

చీఫ్ విప్, విప్‌లుగా నియమితులైన వా రికి టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు శుభాకాంక్షలు తెలిపారు. చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఇతర విప్‌లను ట్విట్టర్‌లో అభినందించారు.

కేసీఆర్‌కు కృతజ్ఞతలు..

ఎంబీసీ సామాజికవర్గానికి చెందిన తన కు శాసనమండలిలో చీఫ్ విప్‌గా నియమించినందుకు సీఎం కేసీఆర్‌కు బీ వెంకటేశ్వర్లు కృతజ్ఞతలు తెలిపారు. తనపై ఉం చిన నమ్మకాన్ని వమ్ముచేయకుండా మండలిలో సభ్యులు, ప్రభుత్వానికి మధ్య సమన్వయానికి కృషిచేస్తానని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *