అమిత్‌షాతో తెదేపా ఎంపీ కీలక భేటీ

భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాను తెదేపా ఎంపీ రామ్మోహన్‌నాయుడు, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు కలిశారు. రాష్ట్ర విభజన హామీలపై సుమారు గంటన్నరపాటు వీరి మధ్య చర్చ జరిగినట్టు తెలుస్తోంది. విభజన హామీలపై ఇప్పటికే ఏపీ ప్రభుత్వం నుంచి డెడ్‌లైన్‌ ఉన్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ భేటీకి రాజకీయపరమైన కారణాలు లేకపోయినప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పెరిగిన కమ్యునికేషన్‌ గ్యాప్‌ను పూడ్చేందుకే ఈ వ్యవహారం అంతా నడుస్తున్నట్టు తెలుస్తోంది. ప్రధానంగా రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం, ప్రత్యేక ప్యాకేజీ విషయంలో ఇప్పటివరకు ఒక్క అడుగు కూడా ముందుకు పడకపోవడం, అలాగే కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఒక్క రూపాయి కూడా ఆంధ్రప్రదేశ్‌కు ఇస్తున్నట్లు ప్రకటించకపోవడంతో కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తంచేసింది. ఇదే అంశంపై తెదేపా ఎంపీలు మొన్న జరిగిన పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల్లో తీవ్ర నిరసన గళం విన్పించారు. ఈ నేపథ్యంలో మార్చి 5లోపు ఓ ప్రకటన చేసే అవకాశం ఉంది. మలివిడత పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు ఈ నెల 5 నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఈ భేటీ ఆసక్తికరంగా మారింది. విశాఖలో రైల్వేజోన్‌, కడపలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు, రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధుల విషయంలో స్పష్టమైన ప్రకటన వచ్చేవరకు తాము శాంతించేది లేదని తెదేపా స్పష్టంచేసిన నేపథ్యంలో ఈ రోజు జరిగిన భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. పెద్దమనిషి తరహాలో నేతృత్వం వహిస్తున్న ఓ వ్యక్తికి సంబంధించిన కార్యాలయంలో ఈ భేటీ జరిగినట్లు సమాచారం. ఈ భేటీలో చర్చకు వచ్చిన అంశాలు ప్రధానంగా రెవెన్యూ లోటు, రైల్వేజోన్‌, కడపలో ఉక్కు కర్మాగారం, ప్రత్యేక ప్యాకేజీ నిధులు.. ఈ నాలుగు అంశాలే ఈ భేటీలో ప్రధానంగా చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ భేటీకి సంబంధించిన అంశాలనే తిరిగి వీరిద్దరూ సీఎం చంద్రబాబుకు వివరించే ఆస్కారం ఉంది. ఆయనకు వివరించాకే తదుపరి నిర్ణయం వెలువడే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు, ఆర్థికశాఖలో జరుగుతున్న వ్యవహారం కూడా అరుణ్‌జైట్లీ ద్వారా తెలుసుకొని అమిత్‌షా వీరికి వివరించినట్లు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *