అధికారులను బురిడీ కొట్టించిన 21మందిపై.. క్రిమినల్ కేసుల నమోదుకు ఆదేశం.. అసలు విషయం ఏంటంటే..

అర్హత లేకపోయినా ఉద్యోగాలు

– సచివాలయ వార్డు వెల్ఫేర్‌ పోస్టుల కేటాయింపులో వింత

– ఆపై నియామపత్రాలందుకున్న వైనం

– అధికారులను బురిడీ కొట్టించిన 21మంది

– తతంగంపై కలెక్టర్‌ ఆగ్రహం

– క్రిమినల్‌ కేసుల నమోదుకు ఆదేశం

– సర్టిఫికెట్లు పరిశీలించిన అధికారులపై శాఖాపరమైన చర్యలు

అక్షిత ప్రతినిధి, అనంతపురం కార్పొరేషన్‌: అర్హతలేకపోయినా ఉద్యోగం సాధించినట్లు కొంతమంది నియామకపత్రాలందుకున్నారు. అధికారులను బురిడీ కొట్టించామని సంబరపడ్డారు. అయితే రీ వెరిఫికేషన్‌లో ఈ విషయం బట్టబయలైంది. గ్రామ,వార్డు సచివాలయ ఉద్యోగాలభర్తీ విషయంలో ఈ తతంగం చోటుచేసుకుంది. అనంతపురం నగరపాలకసంస్థ ఇందుకు వేదికగా మారింది. అయితే అధికారులను బురిడీ కొట్టించి నియామపత్రాలు పొందిన అభ్యర్థుల మెడకే ఉచ్చు బిగుసుకుంది. అలాగే ధ్రువీకరణపత్రాల పరిశీలన, నియామకపత్రాల పంపిణీలో నిర్లక్ష్యంగా వ్యవవహరించిన అధికారులకూ మొట్టికాయలు పడ్డాయి. ఇలా వ్యవహరించిన అభ్యర్థులపై క్రిమినల్‌ చర్యలకు, అలసత్వంగా వ్యవహరించిన అధికారులపై శాఖాపరమైన చర్యలకు కలెక్టర్‌ సత్యనారాయణ ఆదేశించారు.

తప్పెవరిది..?

పట్టణాల్లో వార్డు వెల్ఫేర్‌ అండ్‌ డెవల్‌పమెంట్‌ సెక్రటరీ పోస్టులు కేటాయించారు. ఈ పోస్టుకు నిబంధనల ప్రకారం బీఏ ఆర్ట్స్‌, హ్యుమానిటీస్‌ అర్హత ఉండాలి. కానీ కొందరు బీకాం, బీఎస్సీ అర్హతతో పరీక్షలు రాశారు. ఆ తరువాత వచ్చిన మెరిట్‌ మార్కులతో ప్రాథమికంగా ఎంపికైన వారు సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరయ్యారు. అక్కడ కూడా సమస్య లేకుండా ఎంపికయ్యారు. నియామకపత్రాలు దక్కించుకున్నారు. అర్హత లేకపోయినా పోస్టు దక్కించుకున్నామని ఊగిపోయారు. అయితే ఇక్కడ తప్పెవరిది? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.

అభ్యర్థులు బీఎస్సీ సర్టిఫికెట్లతో వస్తే పరిశీలించాల్సిన అధికారులు ఎందుకు వాటికి అర్హత ఉన్నట్లు తేల్చారనే ప్రశ్నకు సరైన సమాధానం లేదు. వార్డు సచివాలయాలకు సంబంధించి జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల అధికారులను సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు కేటాయించారు. కిందిస్థాయి సిబ్బంది కాకుండా ఒక స్థాయి కలిగిన అధికారులకు ఆ బాధ్యత అప్పగించారు. కానీ సర్టిఫికెట్లు సరిగా పరిశీలించకుండానే వాటిని ఓకే చేయడం ద్వారా అధికారులే పెద్దతప్పిదానికి పాల్పడ్డారు. తప్పని తెలిసినా..జరగబోయే పరిణామాలు తమకు మంచిగా కనిపిస్తూండడంతో అది తమ అదృష్టంగా అభ్యర్థులు భావించారనే విషయం స్పష్టమవుతోంది. ఏది ఏమైనా తప్పు తప్పే.. అందుకు ఉన్నతాధికారులు తీసుకోబోయే చర్యలకు బాధ్యులు కాక తప్పదు.

బయటపడిందిలా..!

వార్డు వెల్ఫేర్‌అండ్‌ డెవల్‌పమెంట్‌ సెక్రటరీ పోస్టులకు సంబంధించి కార్పొరేషన్‌ కార్యాలయంలో రెండురోజుల క్రితం అభ్యర్థులకు నియామకపత్రాలందజేశారు. అయితే తమకు డిగ్రీలో బీఎస్సీ, బీకాం అర్హత ఉన్నా నియామక పత్రాలివ్వలేదని, అదే అర్హత ఉన్న కొందరికి మాత్రం ఇచ్చారని కొంతమంది అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై నగర కమిషనర్‌తో పాటు జాయింట్‌ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఇక్కడే అసలు కథ మొదలైనట్లు తెలిసింది. జేసీ, కమిషనర్‌ ఈ విషయంపై సీరియ్‌సగా దృష్టి సారించినట్లు తెలిసింది. బీఎస్సీ, బీకాం అభ్యర్థులకు నియామకపత్రాలు ఎలా దక్కాయని ఆరా తీశారు. అనంతరం వెంటనే సర్టిఫికెట్ల రీ వెరిఫికేషన్‌(పునఃపరిశీలన) చేయించినట్లు సమాచారం.

దీంతో సంబంధంలేని(అర్హత లేని) బీఎస్సీ, బీకాం సర్టిఫికెట్లతో మొత్తం 21మంది నియామకపత్రాలు పొందినట్లు రుజువైంది. ఈ విషయం వారు కలెక్టర్‌ సత్యనారాయణ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఈ తతంగంపై ఆయన సీరియస్‌ అయ్యారు. వెంటనే సంబంధిత అభ్యర్థులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. అలాగే సంబంధిత సర్టిఫికెట్లు వెరిఫికేషన్‌ చేసిన అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలిచ్చారు. అధికారుల్లో తాడిపత్రి మున్సిపాలిటీలో పనిచేస్తున్న ముగ్గురు, హిందూపురం మున్సిపాలిటీలో పనిచేస్తున్న మరో ముగ్గురు..ఇలా మొత్తం 10మంది అధికారులున్నట్లు తెలిసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *